తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి రోజులొచ్చాయి. వాళ్లే ప్రధాన పాత్రధారులుగా కథల్ని వండుతున్నారు. కోట్ల పారితోషికాలు ముట్టజెబుతున్నారు. `ఈ పాత్రని ఈయనే చేయాలి..` అని ఫిక్సయితే.. ఆ నటుడ్ని ఎంత పారితోషికం ఇచ్చైనా తీసుకొచ్చుకుంటున్నారు. రావు రమేష్ విషయంలో అదే జరిగింది. మలయాళ సూపర్ హిట్టు.. `నాయట్టు`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ పాత్రల కోసం విష్ణు, రావు రమేష్, అంజలిలను ఎంచుకున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. కరుణ కుమార్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ చేతికి ఈ రీమేక్ రాగానే.. `ముందు రావు రమేష్ డేట్లు బుక్ చేయండి. ఆయన చేస్తానంటేనే ఈ రీమేక్ చేద్దాం` అని… అల్లు అరవింద్ చెప్పార్ట. దాన్ని బట్టి ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోంది. ఈ కథ విన్న వెంటనే రావు రమేష్ ఓకే చెప్పేశారు. ఈ సినిమా కోసం రావు రమేష్ బల్క్ కాల్షీట్లు ఇవ్వడంతో ఆయన పారితోషికం 1.5 కోట్లుగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈమధ్య కాలంలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుకి, అందునా తెలుగు నటుడికి ఈ స్థాయి పారితోషికం ఎవరూ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం `నాయట్టు` తెలుగు స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది.