చిరంజీవి – వశిష్ట కాంబినేషన్ లో ‘విశ్వంభర’ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇదో సోషియో ఫాంటసీ కథ. ఒక్క మాటలో చెప్పాలంటే ‘జగదేకవీరుడు – అతిలోక సుందరి’ టైపు కథ. అలాంటి కథల్లో మాయలూ, మంత్రాలూ కంపల్సరీ. ఓ పాజిటీవ్ శక్తికీ, నెగిటీవ్ ఎనర్జీకీ మధ్య జరిగే పోరు. ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ గుర్తుంది కదా? అందులో మాంత్రికుడి పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్రలో అమ్రిష్ పురి నటించారు. ఇప్పుడు అలాంటి పాత్రే… ‘విశ్వంభర’లోనూ ఉంది. ఈ పాత్ర.. రావు రమేష్‌కి దక్కింది. మాంత్రికుడు అంటే మెడలో పుర్రెల దండ వేసుకొని తిరిగే ఓల్డేజీ మాంత్రికుడు కాదు. కాస్త మోడ్రన్‌గానే ఉంటుందని సమాచారం.
ఓ శాపం వల్ల నేల మీద కాలు పెట్టలేడు. గాల్లోనే తిరిగేస్తుంటాడు. ఆ పాత్రని అలా వెరైటీగా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ కథలో కాన్ఫ్లిక్ట్ రావు రమేష్ వల్లే వస్తుందని, కథని మలుపు తిప్పే క్యారెక్టర్ తనదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. స్టార్ కాస్ట్ కూడా చాలా బలంగా కనిపించనుంది. త్రిష, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. చిరు చెల్లాయిలుగా నటించేవాళ్లూ ఓ మాదిరి క్రేజ్ ఉన్న హీరోయిన్లే. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన ఓ సెట్ లో పెళ్లి పాట తెరకెక్కిస్తున్నారు.