జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ” నేను మొదటి నుండి వైఎస్ఆర్సిపి మనిషినే” అని నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందే తాను వైఎస్ఆర్సిపి టికెట్ కోసం ప్రయత్నించానని, అక్కడ టికెట్ దక్కకపోవడంతో కేవలం ఏదో ఒక పార్టీలో టికెట్ సంపాదిస్తే పోటీలో ఉండవచ్చని జనసేన పార్టీ లో చేరాను అని ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఇవాళ ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా జనసేన తనను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు వివరాల్లోకి వెళితే..
నిన్న చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్న రాపాక వరప్రసాద్:
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నిన్న చేసిన వ్యాఖ్యల లో చాలా వాటిపై ఈరోజు యు టర్న్ తీసుకున్నారు. రాపాక వరప్రసాద్ ఇవ్వాళ ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను జనసేన ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని , సోషల్ మీడియాలో తనపై విమర్శలు సబబు కాదని వ్యాఖ్యానించారు. జనసేన గాలివాటం పార్టీ అని తాను అనలేదని, తన గురించి తాను సెటైర్ వేసుకుంటూ తాను ఏదో గాలివాటంగా గెలిచానని అన్నానని చెప్పుకొచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అంటూ నిన్న చేసిన వ్యాఖ్యలపై కూడా యూటర్న్ తీసుకున్నారు రాపాక. జనసేన పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చెప్పడానికి తాను ఎవరిని అని, ఆ పార్టీ భవిష్యత్తు ఆ పార్టీ ని పార్టీ అధ్యక్షుడు ఎలా నడుపుతారు అన్న దానిపై ఆధారపడి ఉంటుందని రాపాక ఈరోజు అన్నారు.
నన్ను ఎందుకు సస్పెండ్ చేయరు అంటున్న రాపాక
అయితే అదే టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ, తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనిపిస్తే తనను ఎందుకు పార్టీ సస్పెండ్ చేయడం లేదంటూ పార్టీని ప్రశ్నించారు. తాను వైఎస్సార్సీపీకి అనుగుణంగా,ష అనుకూలంగా ఉన్న మాట వాస్తవమేనని ఇందులో దాచవలసింది ఏమీ లేదని, గెలిచిన మొదటి ఆరు నెలల్లో తాను జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని, అయితే ఆ తర్వాత వైఎస్ఆర్సిపి కి అనుకూలం గా మారిపోయిన తర్వాత నియోజకవర్గానికి కాస్తో కూస్తో చేయగలుగుతున్నాను అని అన్నారు. అయితే అధికారికంగా వైఎస్సార్సీపీలోకి ఎప్పుడు చేరబోతున్నారు అని విలేకరులు ప్రశ్నించగా, భవిష్యత్తు గురించి తాను చెప్పలేనని అంటూ తనను పార్టీ ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాపాక వరప్రసాద్ పార్టీ తనను సస్పెండ్ చేస్తే బాగుంటుందని కోరుకోవడానికి కారణం – అలా పార్టీ సస్పెండ్ చేస్తే ఆయన తనకు నచ్చిన పార్టీలో చేరే మార్గం సుగమం అవుతుంది. అదే ఇప్పుడు తనకు తానుగా వేరే పార్టీలో చేరితే ఫిరాయింపుల చట్టం కింద ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోయి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే వైఎస్ఆర్సీపీ తరఫున తనకు టికెట్ దక్కుతుందో లేదో తెలియదు, ఒకవేళ వైఎస్ఆర్సిపి టికెట్ దక్కినా, తిరిగి గెలుస్తాడో లేదో తెలియదు కాబట్టి పార్టీ తనను సస్పెండ్ చేస్తే ఈ ఎన్నికల జంజాటం అంతా లేకుండా నేరుగా వైఎస్ఆర్సీపీలోకి చేరుకోవచ్చని ఆయన ఆశ పడుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
మరి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి