ఎన్నికలకు ముందు… ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనలో చేరి.. పవన్ కల్యాణ్‌ను కాకా పట్టి… టిక్కెట్ పొంది..విజయం సాధించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు.. నేరుగా పవన్ కల్యాణ్‌పైనే సెటైర్లు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ ధర్నా పెట్టినా.. సభ నిర్వహించినా.. పది మంది మాత్రమే వస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన ఆయన.. పవన్ ఓ సాదాసీదా వ్యక్తి అన్నట్లుగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ సభ పెడితే.. పది మంది మాత్రమే వస్తారని… ముందుముందు ఆ వచ్చే వాళ్లు కూడా తగ్గిపోతారని చెప్పుకొచ్చారు. కాకినాడలో పవన్ కల్యాణ్ చేసిన రైతు సౌభాగ్య దీక్షను ఉద్దేశించి రాపాక ఈ వ్యాఖ్యలు చేసారు.
రైతు సౌభాగ్య దీక్షకు రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై… రాపాక… జనసేన అసలు ఒక పార్టీనా అన్నట్లుగా స్పందించారు. ఇతర కారణాల వల్ల హాజరు కాలేదని.. ఇక ముందు కూడా హాజరవుతానో.. లేదో అన్నట్లుగా చెప్పుకొచ్చారు. చిన్న చిన్న విషయాలకు.. సభలు, ధర్నాలు పెట్టడం సరి కాదని చెప్పుకొచ్చారు. రైతులకు ధాన్యం డబ్బులు అందక ఇబ్బంది పడటం.. రైతు సమస్యలను.. రాపాకకు.. చిన్న సమస్యగా చెప్పుకొచ్చారు. అంతే కాదు.. పవన్ కల్యాణ్ ను పట్టించుకునేవారు రోజు రోజుకు తగ్గిపోతారని కూడా.. స్పష్టం చేసి.. తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు.
రాపాక వరప్రసాద్ ఇప్పటికే అధికార పార్టీ ఫోల్డ్ లోకి వెళ్లిపోయారని.. వారు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారన్న అనుమానాలు జనసేనలో వ్యక్తమవుతున్నాయి. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదన్న ప్రచారాన్ని ఆయన తన అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఇప్పటికే వైసీపీ నేతలతో సన్నిహితంగా తిరుగుతున్నారు. సొంత పార్టీని ధిక్కరిస్తున్నారు. అనధికారికంగా రాపాక ఇప్పటికే జనసేనకు దూరమైనట్లేనని చెబుతున్నారు.