జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకు.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కనీసం విష్ చేశారో లేదో కానీ… జగన్ పుట్టినరోజుకు మాత్రం పాలాభిషేకం చేసేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయడం.. కచ్చితంగా విశేషమే… అయితే.. రాపాక పాలాభిషేకం చేయడంలో మాత్రం విశేషం ఉంది. ఎందుకంటే.. జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్‌కు.. ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వడం కానీ.. పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కానీ చేయకపోవడంతో.. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ను కలిసి పార్టీలో చేరారు.
రాజోలులో అప్పటికే.. కొంత మంది జనసేన కోసం పని చేస్తున్నప్పటికీ.. వారిని కాదని.. మాజీ ఎమ్మెల్యే కాస్త అనుభవం ఉన్న నేత అన్న కారణంగా రాపాకకు టిక్కెట్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అదృష్టం కలసి వచ్చిందో.. ఇంకో కారణమో కానీ.. ఆ పార్టీ తరపున ఆయన ఒక్కరే విజయం సాధించారు. మొదట్లో పవన్ కల్యాణ్ పై కృతజ్ఞత తెలిపిన రాపాక.. ఇప్పుడు మాత్రం.. పవన్ ను తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించారు. పవన్ మీటింగ్ లకు పది మంది కూడా రారని వెటకారం చేస్తున్నారు.
పవన్ రాజకీయాలకు పనికి రారన్నట్లుగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల కిందట.. పోలీసులు ఆయనపై తప్పుడు కేసులు పెడితే.. పవన్ కల్యాణ్ రంగంలోకి దిగితేనే వదిలి పెట్టారు. అవన్నీ మర్చిపోయి.. ఇప్పుడు జగన్ భజనలో రాపాక మునిగితేలుతున్నారు. అసెంబ్లీలో… జనసేన ఉనికి లేకుండా చేయడానికి ఆయన తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తోంది.