జనసేన తరపున గెలిచి తాను వైసీపీ మనిషినని చెప్పుకుంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీలోనూ చిచ్చు పెడుతున్నారు. రాజోలు వైసీపీలో మూడు గ్రూపులున్నాయని.. అందులో తనది ఒకటని స్వయంగా ప్రకటించుకున్నారు. మిగిలిన రెండు గ్రూపులంటే..ఒకటి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు..మరొకరు వైసీపీ ఇన్చార్జ్ అమ్మాజీ. వీరిద్దరే వైసీపీలో నువ్వా..నేనా అని పోటీ పడుతూంటే.. మధ్యలో రాపాక వరప్రసాద్ కూడా వారి మధ్యలో దూరి మీరిద్దరు కాదు..నేను అని ప్రకటించేసుకుంటున్నారు.
వైసీపీ హైకమాండ్‌ను తన వైపు తిప్పుకునేందుకు జనసేనను చులకనగా మాట్లాడుతున్నారు. జనసేన గాలి వాటం పార్టీ అని.. గత ఎన్నికల్లో తానే దయతలచి ఆ పార్టీ తరపున పోటీ చేసినట్లుగా చెప్పుుకుంటున్నారు. జనసేన ఓ వర్గానికి చెందిన పార్టీ అని.. భవిష్యత్తులో జనసేన ఉనికే ఉండదంటున్నారు. వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తే రాలేదు కాబట్టి.. ఏదో ఓ పార్టీ తరపున పోటీ చేయాలి కాబట్టి జనసేన తరపున చేశానంటున్నారు. వైసీపీతోనే తన పయనం అని తేల్చేశారు.
అయితే రాపాక ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే… వైసీపీలో తనకు చోటు ఉంటుందా లేదా అని నిర్ధారించుకోవడానికే. వచ్చే ఎన్నికల్లో రాజోలులో వైసీపీ గెలవాలంటే… గ్రూపులను అంతం చేయాల్సి ఉందని..ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. రాపాక అంటున్నారు. వైసీపీలో గ్రూపులు అంతం కావాలంటే జగన్ నిర్ణయం తీసుకోవాలంటున్నారు. రాపాక తీరు చూసి వైసీపీ నేతలే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పడేసి.. పక్క పార్టీలో గెలిచి..తాను వైసీపీ అని చెప్పుకుంటూ పార్టీపై పెత్తనం కోసం చూస్తున్న ఆయన తీరు రాజోలు నేతల్ని అసహనానికి గురి చేస్తోంది.