రాజోలు మాజీ ఎమ్మల్యే రాపాక వరప్రసాదరావు మళ్లీ జనసేనను కాకా పట్టే పనిలో ఉన్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుండి వైసీపీ జోలికి వెళ్లని ఆయన జగన్ తో సమావేశాలకు ఆహ్వానం వచ్చినా రానట్లుగా ఉండిపోయారు. తాజాగా మలికిపురంలో జనసేన కార్యక్రమానికి హాజరయ్యి.. జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తో చర్చలు జరిపారు. కానీ పార్టీలో చేరికల గురించి తనకు సంబంధం లేదని ఆయన తేల్చేశారు. దీంతో ఏదో ఓ మార్గం చూసుకుని పవన్ తో టచ్ లోకి వెళ్లేందుకు రాపాక ప్రయత్నిస్తున్నారు.
2019లో జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక. ఆయనకు పవన్ కల్యాణ్ మంచి గౌరవం ఇచ్చారు. మొదట్లోనే ఆయనపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే పవన్ అడ్డుకున్నారు. అండగా నిలబడ్డారు. అయితే కొన్నాళ్లకే ఆయన పార్టీ ఫిరాయించారు. పవన్ వల్ల తాను గెలవడం ఏంటి.. స్వయంగా పవనే ఓడిపోయారు కాబట్టి తనను ఏం గెలిపిస్తారని సెటైర్లు వేశారు. అనుచితంగా మాట్లాడారు . అలా మాట్లాడితేనే జగన్ మెచ్చుతారని ఆయన రెచ్చిపోయారు. చివరికి రాజోలు టిక్కెట్ ను జగన్ ఆయనకు ఇవ్వలేదు. టీడీపీ నుంచి పిలుచుకుని వచ్చి మరీ గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారు.
రాపాకకు అమలాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆయన బాలయోగి కుమారుడు హరీష్ చేతిలో మూడున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనసేనతో కాదనుకున్నందుకు రాజకీయ భవిష్యత్ అందకారం అయిపోయిందని ఆయన ఫీలవుతున్నారు. అందుకే కనీసం అధికార పార్టీ అని చెప్పుకునేందుకైనా ఆయన కూటమి కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నమ్మితే ఘోరమైన వ్యాఖ్యలు చేసిన ఆయనను జనసేన దగ్గరకు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు .