రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరాలో ఆయనకు అర్థం కావడం లేదు. కానీ టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేరు. దాంతో తనకు చాన్స్ ఉందని ఆయన అనుకుంటున్నారు. గత ఎన్నికల వరకూ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరిపోయారు. రాజోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనకు హ్యాండిచ్చి వైసీపీలో చేరిన రాపాకకు..అమలాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు.
వైసీపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత రాపాక వరప్రసాదరావు టీడీపీ కీలక నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు తదితరులను కలిసి టీడీపీలో చేరేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే కూటమి పార్టీల్లో ఎవరు చేరాలన్నా ఇతర పార్టీల గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. దీంతో రాపాక టీడీపీలో చేరాలంటే జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.
2019లో జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. కానీ ఆయన జనసేనను అవమానించి వైసీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో చేరుతానంటే.. జనసేన అంగీకరిస్తుందా అన్నదే కీలకం. పార్టీని వీడిపోయి ఉంటే సరే కానీ ఆయన పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే జనసైనికులు ఆయనపై అసంతృప్తితో ఉన్నారు.