లోక్ సభ ఎన్నికల్లో ఓటు శాతం పెంచేందుకు ప్రముఖ ప్రయాణ యాప్ రాపిడో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న రాపిడో ఉచిత సేవలను అందిస్తుందని సంస్థ వెల్లడించింది.
సోమవారం ఎల్బీ స్టేడియంలో సవారీ బాధ్యత పేరుతో రాపిడో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హాజరై రాపిడో తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో రాపిడో తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
రాపిడో సహా వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఓటర్లు ఓటు నౌ కోడ్ ను ఉపయోగించి రాపిడో యాప్ లో రైడ్ లను ఉచితంగా పొందవచ్చు. ఈ ఉచిత సేవల కోసం 100 కంటే ఎక్కువ నగరాల్లో 10 లక్షల మంది కెప్టెన్ లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
తెలంగాణలో ఈ నెల 13న హైదరాబాద్ సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వంటి నగరాల్లో రాపిడో ఈ ఉచిత సేవలను అందించనుంది.