ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తోందని ..అమరావతిలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో నిర్మిస్తున్న శాశ్వత సచివాలయ భవనాలకు పునాది వేసే పనులను చంద్రబాబు ప్రారంభించారు. ప్రపంచానికే తలమానికంగా సచివాలయ టవర్లు నిర్మిస్తామన్నారు. దేశంలోనే తొలిసారి ర్యాప్ట్ ఫౌండేషన్ విధానం తీసుకొచ్చి.. 36 నెలల్లో టవర్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నామని ప్రకటించారు. అమరావతిలోని రాయపూడిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో శాశ్వత సచివాలయ టవర్స్ లో నాలుగో టవర్ కు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను చంద్రబాబు ప్రారంభించారు. సుమారు రూ. 4 వేల 500 కోట్ల రూపాయల వ్యయంతో రాజధానిలో శాశ్వత సచివాలయం కోసం ఐదు టవర్లు నిర్మిస్తున్నారు.
ఐదో టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. ఇందులో 50 అంతస్తులు ఉంటాయి. మిగతా నాలుగు టవర్లలో 40 అంతస్తులు ఉంటాయి. వీటిలో రెండు టవర్లను షాపూర్జీ పల్లోంజీ, మరో రెండు టవర్లను ఎల్ అండ్ టి, ఒక టవర్ ను నాగార్జున సంస్థ నిర్మిస్తోంది. రాజధాని భూములు నదీ తీరం కావడం, నల్లరేగడి భూములు కూడా కావడంతో సచివాలయ ఫౌండేషన్ ను కొత్త టెక్నాలజీతో వేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ కన్సల్టెంట్ల సూచనలతో నిర్మిస్తున్న ఈ టవర్లకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ను భూమిలో ఐదు మీటర్ల లోతు నుంచి పూర్తి కాంక్రీట్ తో నిర్మిస్తారు. మూడు రోజుల పాటు సుమారు 11వేల 500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఇందులో వేస్తారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టవర్ల ను నిర్మిస్తున్నారు.
దేశంలో అత్యంత ఆకర్షణీయంగా ఈ టవర్లు రూపుదిద్దుకోబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషంగా చెబుతున్నారు. హైకోర్టు విభజనను స్వాగతిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కొత్త ఏడాదిలో ఏపీ నుంచే హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. ఈ రోజే కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తూండటంతో.. సీఎం ఉత్సాహంగా ఉన్నారు.