గతవారంలో సంచలమైన మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యల వేడి గడచిన రెండ్రోజులుగానే కాస్త తగ్గినట్టు కనిపించింది. మంత్రి ఈటెల తన పనిలో తాను బిజీబిజీగా గడుపుతున్నారు. గులాబీ జెండాలకు అసలైన ఓనర్లం మేమేననీ, మధ్యలో వచ్చినోళ్లు కాదని ఇటీవలే ఈటెల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత చర్చకు దారి తీశాయో తెలిసిందే. ఈ వ్యాఖ్యల అనంతరం ఆయన సైలెంట్ అయిపోయారు. ఆ అంశాన్ని ఆయన ముందు ప్రస్థావించినా కూడా మౌనంగానే నవ్వుతూ తప్పుకుంటున్నారు! అయితే, కాస్త చల్లబడింది అనుకున్న అంశాన్ని ఇంకాస్త రాజేసినట్టు మాట్లాడారు మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈటెలతోపాటు రసమయి కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత కేవలం బోర్డు మాత్రమే మారాయనీ, ఇంకేమీ మారలేదని వ్యాఖ్యానించారు బాలకిషన్. మారిందల్లా ఆంధ్రప్రదేశ్ పోయి, తెలంగాణ మాత్రమే స్కూళ్ల బోర్డుల మీదికి వచ్చిందన్నారు. తన వ్యాఖ్యని వేరేలా చూడొద్దనీ, ఉన్నది ఉన్నట్టుగా తాను మాట్లాడుతున్నానని రసమయి అన్నారు. ప్రభుత్వంలో ఉండి ఇట్ల మాట్లాడుడేంటని అనుకోవదన్నారు. నాకు రాజన్న (ఈటెల రాజేందర్)కి ఒక్కోసారి వాస్తవాలు మాట్లాడకోకుండా పొట్ట ఊకోదు ఇవతలకి రా అంటది అన్నారు. ఎందుకంటే, తామంతా ఉద్యమం నుంచి వచ్చినోళ్లమనీ, వాస్తవాల మీద ఉద్యమాలను నడిపినవాళ్లమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎలాగో ఉండాలని కలలుగన్నోళ్లమన్నారు.
ఈ వ్యాఖ్యలపై వెంటనే ఈటెల స్పందించి… రసమయి ఉన్నది ఉన్నట్టే మాట్లాడారంటూ చెప్పారు! రసమయికి స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి అలా ఓపెన్ గా మాట్లాడిండు అన్నారు. అయిపోయిందిలే అనుకున్న టాపిక్ ని రసమయి మళ్లీ తెరమీదికి తేవడం ఒకెత్తు అయితే… తెరాస పాలన మీద కూడా విమర్శ చేయడం విశేషం! రాష్ట్రం వచ్చాక బోర్డులు మాత్రమే మారాయని అనడం తెరాసపై విమర్శ చేయడమే. దీంతోపాటు, ఉద్యమ నేపథ్యం ఉన్నవారి ఆకాంక్షలు వేరుగా ఉంటాయంటూ.. పరోక్షంగా ఇదీ ప్రస్తుతం తెరాసలోని కొంతమంది నేతలకు తగిలేట్టుగానే మాట్లాడారు. సరే, ఈటెల వ్యాఖ్యలు అంటే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఎక్కువ తక్కువ ఏ కామెంట్ చేసినా సర్దుకుపోయారు. కానీ, రసమయి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.