దిశ ఘటన పై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ ఉన్మాదానికి సినిమాలు కూడా ఓ కారణమని, మితిమీరిన శృంగారం, అంగాంగ ప్రదర్శన వల్ల యువత పాడైపోతోందని వాదించేవాళ్లున్నారు. అలాంటివాళ్లకు కథానాయికలు ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. దీనిపై తాజాగా రాశీఖన్నా కూడా స్పందించింది.
“సినిమాల్లో చాలా మంచి చూపిస్తున్నారు. పెద్దవాళ్లని గౌరవించండి. అమ్మానాన్నల్ని బాగా చూసుకోండి అని చెబుతున్నారు. అవి ఎవ్వరూ పాటించరు. చెడు మాత్రం అందరి దృష్టిలో పడిపోతోంది. గ్లామరెస్గా కనిపించడం మా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏది సభ్యత? ఏది అసభ్యత? అనేదానికి ప్రమాణాలేమైనా ఉన్నాయా? ఒక్కోసారి నిండుగా దుస్తులు వేసుకున్నా వేలు పెట్టి చూపిస్తారు. ఒక్కోసారి ఎంత తక్కువ బట్టలేసుకున్నా అందంగానే ఉంటుంది. మితిమీరిన పోకడలు అనేవి చూసే దృష్టిని బట్టే ఉంటాయి” అంటోంది. అంతేకాదు.. ఈనాటి అమ్మాయిలకు ఓ సలహా కూడా ఇస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లండి… ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే వాళ్ల కంట్లో సూటిగా కొట్టండి… అంటోంది. అయితే ఇంట్లో అమ్మానాన్న కూడా పిల్లలకు కౌన్సిలింగ్ చేయాలని, అమ్మాయిల్ని గౌరవించడం ఎలాగో నేర్పించాలని ఉపదేశిస్తోంది.