పబ్లిసిటీ పలు రకాలు. ఏదో రూపంలో పబ్లిసిటీ తెచ్చుకుంటే చాలు. అందుకోసం ఏం చేసినా ఫర్వాలేదు. అందులో భాగంగానే థియేటర్ కౌంటర్లో టికెట్లు అమ్మడానికి సిద్ధమైంది రాశీఖన్నా. తను కథానాయికగా నటించిన `ప్రతిరోజూ పండగే` సినిమా కోసమే ఈ కసరత్తంతా. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మారుతి దర్శకుడు. ఈ శుక్రవారం విడుదల కానుంది. ప్రమోషన్స్ పీక్స్ లో జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్లోని గోకుల్ థియేటర్లో ని కౌంటర్లో టికెట్లు అమ్మడానికి రెడీ అయ్యిందీ భామ. బుధవారం ఉదయం 11 గంటలకు రాశీఖన్నా కౌంటర్లో కూర్చోబోతోంది.
అయితే ఈ ఐడియా ఏమీ కొత్తది కాదు. ఇది వరకు చాలా మంది ట్రై చేసినదే. మొన్నటికి మొన్న `మీకు మాత్రమే చెబుతా` ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ కూడా ఇదే ప్లాన్ వేశాడు. ఐమాక్స్ థియేటర్ కౌంటర్లో టికెట్లు అమ్మాడు. అసలు ఈ ఐడియానే మనది కాదు. బాలీవుడ్ లో చాలా మంది ఈ పబ్లిసిటీ ట్రిక్ ని ఫాలో అయ్యారు. ఇప్పుడు రాశీఖన్నా వంతు వచ్చిందంతే. గోకుల్లో ప్రతిరోజూ పండగే సినిమా చూడాలనుకునేవాళ్లకీ, రాశీ ఖన్నా నుంచి టికెట్లు అందుకోవాలనుకునేవాళ్లకీ ఇదే సువర్ణావకాశం మరి.