కథానాయికలు పారితోషికం చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఓ సినిమా హిట్టు కొడితే.. పారితోషికం రెట్టింపు అవుతుంది. ‘కథ నచ్చితే చాలు..’ పారితోషికం పట్టించుకోను అనే స్టేట్మెంట్లు కేవలం మాటలకే పరిమితం. కానీ రాశీఖన్నా మాత్రం ‘పారితోషికం గురించి పట్టించుకోనే రకాన్ని కాదు’ అంటోంది. ”నేనో సినిమాపై సంతకం చేయాలంటే మూడు విషయాల్ని దృష్టిలో పెట్టుకొంటా. కథ, నా పాత్ర, దర్శకుడు. ఈ మూడింటిలో ఏది నచ్చినా సినిమా చేస్తా. ఈ మూడూ నచ్చకపోతే పది కోట్లు ఇచ్చినా సినిమా ఒప్పుకోను” అని తెగేసి చెబుతుంది.
పారితోషికం చూసి సినిమా ఒప్పుకొన్న సందర్భం తన కెరీర్లో ఇప్పటి వరకూ ఎదురుకాలేదట. ఇక ముందూ ఇదే మార్గంలో నడుస్తా అంటోంది. ”కొంత మంది దర్శకులు కథలు బాగా చెప్తారు. కానీ తెరపై చూపించలేరు. కొంతమంది మాత్రం చెప్పినదానికంటే బాగా తీస్తారు. అందుకే కథ కంటే పాత్ర కంటే నేను దర్శకుడికే ప్రాధాన్యం ఇస్తా. నాలో నటిని బయటకు తీసుకొచ్చేది వాళ్లే” అంటోంది రాశీఖన్నా.