టాలీవుడ్లోని టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్నా పేరు కూడా చేరిపోతుంది. వరుస విజయాలతో, టాప్ స్టార్లతో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. రష్మిక కాల్షీట్లు కావాలంటే నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. దాన్ని అదునుగా చేసుకుని రష్మిక అమాంతం తన పారితోషికం పెంచేసిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమన్నా, కాజల్ లాంటి టాప్ స్టార్లకు ఇచ్చే పారితోషికమే రష్మిక కు ఇవ్వాల్సివస్తోందన్నది, రష్మిక పారితోషికం భరించలేక చాలామంది నిర్మాతలు రష్మికని పక్కన పెట్టారన్నది లేటెస్ట్ ఖబర్.
అయితే దీనిపై రష్మిక కాస్త ఘాటుగానే స్పందించింది. పారితోషికం అనేది ఎప్పుడూ డిమాండ్ – సప్లైయ్ సూత్రాలపైనే ఆధారపడి ఉంటుందంటూ ఎకనామిక్స్ సూత్రాలని వల్లిస్తోంది. ఓ కథానాయికకు ఎంతివ్వాలో నిర్మాతలకు తెలీదా? అంటూ ఫైర్ అవుతోంది. ఓ నిర్మాత కథానాయికకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చాడంటే… ఆ కథానాయికు అంత డిమాండ్ ఉందన్న సంగతిని అర్థం చేసుకోవాలని, కేవలం డిమాండ్ చేసినంత మాత్రాన డబ్బులు ఇచ్చేయని అంటోంది. పారితోషికం పెంచడం వల్ల ఏ సినమానీ వదులుకోలేదని, తానే కాల్షీట్లు సర్దుబాటు చేయకపోవడం వల్లో, కథ నచ్చకపోవడం వల్లో కొన్ని సినిమాల్ని వదులుకున్నానని అంటోంది. ఇన్ని చెప్పినా ప్రస్తుతం తన పారితోషికం ఎంతన్నది మాత్రం చెప్పలేదు. అది ఇప్పటికీ టాప్ సీక్రెట్టే.