రష్మిక హవా మామూలుగా లేదు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో తన దూకుడు చూపించేస్తోంది. రష్మిక డేట్లు కావాలంటే మరో రెండేళ్ల వరకూ ఆగాల్సిన పరిస్థితి వచ్చిందంటే, తను ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవొచ్చు. ‘పుష్ష2’లో తనే నాయిక. ధనుష్ – శేఖర్ కమ్ముల `కుబేర`లో రష్మిక హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో `గాళ్ ఫ్రెండ్` అనే సినిమా చేస్తోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ కథ. ‘రెయిన్ బో’ అనే మరో సినిమా కూడా రష్మిక సెట్స్‌పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇదంతా.. టాలీవుడ్ లిస్టు.
బాలీవుడ్ విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ – మురుగదాస్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న ‘సికిందర్’లో నటిస్తోంది. విక్కీ కౌశల్ తో ‘చావా’ అనే సినిమా చేస్తోంది. `యానిమల్` తరవాత హిందీలో తన క్రేజ్ బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే అవకాశాలూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే రష్మిక మాత్రం సౌత్ ఇండియన్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రూపుదిద్దుకొనే చిత్రంలో రష్మికని ఎంచుకొన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ‘స్పిరిట్’లోనూ తనే కథానాయికగా కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ‘పుష్ష 3’ కూడా వెనువెంటనే పట్టాలెక్కిస్తానంటే, అందుకోసం ఇంకొన్ని కాల్షీట్లు కేటాయించాలి. ఇవన్నీ పెద్ద పెద్ద సినిమాలే. అన్నీ పూర్తవ్వాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పటి వరకూ రష్మిక మరో సినిమా ఒప్పుకొనే ఛాన్సులు కనిపించడం లేదు. పారితోషికం ఎక్కువ ఇస్తానన్నా రష్మిక కొత్త కథలు వినడానికి ఇష్టపడడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.