‘ఏం నడుస్తోందిప్పుడు’ అనే ఓ ఫేమస్ కమర్షియల్ యాడ్ ఉంది. ఇప్పుడు ‘ఏం నడుస్తోంది’ అని అడిగితే ‘రష్మిక టైమ్ నడుస్తోంది’ అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. వరుస హిట్లతో అదరగొడుతోంది రష్మిక. `యానిమల్`తో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ‘పుష్ప 2’తో మరోసారి అదరగొట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో `ఛావా`తో ఇంకో సూపర్ హిట్ కొట్టేసింది.
విక్కీ కౌశల్ నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. శుక్రవారం విడుదలైన ఈ సినిమా `సూపర్ హిట్` టాక్ సంపాదించుకొంది. తొలి రోజే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ యేడాది తొలి రోజు వసూళ్లలో ఇదే రికార్డ్. విక్కీ కౌశల్ సినిమాకి ఈ ఇంతటి ఓపెనింగ్స్ రావడం కూడా ఇదే తొలిసారి. విక్కీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యాక్షన్ సన్నివేశాల్లో విక్కీ అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో విక్కీ విశ్వరూపం చూపించేశాడు. ఔరంగజేబ్‌గా కనిపించిన అక్షయ్ ఖన్నా సైతం తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర చేశాడు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో ఇంత క్వాలిటీ మేకింగ్ తో సినిమా రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ హిట్టుతో బాలీవుడ్ లో రష్మిక మరో మెట్టు ఎక్కినట్టే. రష్మిక కూడా సౌత్ ఇండియా సినిమాలకంటే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కే ఎక్కువ టైమ్ ఇవ్వడానికి ఇష్టపడుతోంది. సల్మాన్ ఖాన్ – మురుగదాస్ కాంబోలో రూపొందిస్తున్న సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ సినిమాకు ‘సికిందర్’ అనే పేరు పెట్టారు. ఇది కాక మరో భారీ ప్రాజెక్ట్ పై సంతకాలు చేసింది. వివరాలు త్వరలో వెల్లడవుతాయి. తెలుగులో ధనుష్ సరసన ‘కుబేర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.