కరోనా చిత్రసీమని పూర్తిగా సంక్షోభంలో నెట్టేసింది. సినిమా రంగం కోలుకోవడానికి చాలా కాలం పడుతుందన్నది విశ్లేషకుల మాట. నిర్మాతలకు కాస్త ఉత్సాహాన్ని, ఊపిరిని ఇవ్వాలంటే తారలు పారితోషికం తగ్గించుకోవాల్సిందే అంటూ సలహా ఇస్తున్నారు. కానీ.. ఆ వాతావరణం ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కడా తగ్గడం లేదు. టాప్ పొజీషన్లో ఉన్న కథానాయికలు `ఇంత ఇస్తేనే చేస్తాం` అంటూ పట్టుబట్టి మరీ కూర్చుంటున్నారు. హీరోల పక్కన సరైన హీరోయిన్లని వెదికి పట్టుకోవడమే గగనం అయిపోతోంది. అలాంటిది దొరికిన హీరోయిన్ తో బేరాలేం ఆడతారు..? అందుకే… వాళ్లు చెప్పిన దానికి ఊ కొట్టక తప్పడం లేదు.
ఈమధ్య చాలామంది హీరోయిన్లు తమ పారితోషికాల్ని పెంచేశారు. ఆ జాబితాలో రష్మిక కూడా చేరిపోయింది. శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న `ఆడాళ్లూ మీకు జోహార్లూ` సినిమా కోసం రష్మికని కథానాయికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రష్మిక.. తన సినీ జీవితంలోనే అత్యధిక పారితోషికం అందుకోబోతోందట. తన పారితోషికం ఇంచుమించుగా.. 1.75 కోట్ల వరకూ ఉంటుందని టాక్. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలూ, హీరోయిన్లూ 20 నుంచి 30 శాతం వరకూ పారితోషికాల్ని తగ్గించుకోవాలని చెబుతున్నారు. లాక్ డౌన్కి ముందున్న పారితోషికాలలో 30 శాతం కోత విధించాలి. ఆ లెక్కన రష్మికకు కోటి కూడా ఇవ్వకూడదు. కానీ.. ఏకంగా 1.75 కోట్లు ముట్టజెప్పాల్సివస్తోంది. తన పారితోషికం 2 కోట్లు డిమాండ్ చేసి, అందులో.. 25 లక్షలు రష్మిక రిబేటు ఇచ్చిందని, తాను తగ్గించిన పారితోషికం అదేనని ఇండ్రస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.