బాలీవుడ్ నుంచి పిలుపు రావడమే గొప్ప విషయం. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు. ఎప్పుడూ అక్కడ్నుంచి ఇక్కడికి హీరోయిన్లని దిగుమతి చేసుకోవడం తప్ప, ఇక్కడి నుంచి బాలీవుడ్ కి వెళ్లి విజయపతాక ఎగరేసిన వాళ్లు చాలా తక్కువ. ఇప్పుడు దక్షిణాది తార.. రష్మిక కు బాలీవుడ్ నంచి పిలుపొచ్చింది. దక్షిణాదిన రష్మిక.. సూపర్ ఫామ్ లో ఉంది. అలాంటి హీరోయిన్ కి బాలీవుడ్ బెర్తు దక్కడం పెద్ద విషయం ఏమీ కాదు. కాకపోతే.. రష్మిక అక్కడ తనదైన ముద్ర వేయగలుగుతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
`మిషన్ మజ్ను`తో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది రష్మిక. సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు సౌత్ ఇండియన్ టచ్ ఉంటుందని, ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని, అందుకే ఏరి కోరి రష్మికని ఎంచుకున్నారని టాక్. రష్మిక కూడా ఎప్పటి నుంచో ఇలాంటి ఆఫర్ కోసమే ఎదురు చూస్తోంది. తనకి ఇది మంచి ఛాన్సే. కాకపోతే.. దక్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్లిన వాళ్లు అక్కడ మెరిసిన దాఖలాలు లేవు. తమన్నా, త్రిష లాంటి వాళ్లే అందుకు పెద్ద ఉదాహరణలు. తెలుగునాట సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే తమన్నా హిమ్మత్ వాలాలో నటించింది. కానీ కలసి రాలేదు. త్రిష కూడా.. బాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేసినా కలసిరాలేదు. అంతేకాదు.. బాలీవుడ్ మోజులో.. దక్షిణాది సినిమాల్ని నిర్లక్ష్యం చేశారు. ఆ సమయంలో.. ఇక్కడ వాళ్ల కెరీర్ కూడా గాడి తప్పింది. రష్మిక కూడా అలాంటి పొరపాటే చేస్తుందేమో అని ఆమె అభిమానులు భయపడుతున్నారు. కాకపోతే.. రష్మిక మాత్రం చాలా ధీమాగా ఉంది. తొలి సినిమాతోనే అక్కడ తన ప్రతాపం చూపించడానికి రెడీ అవుతోంది. మరి తనకెలాంటి ప్రతిఫలం వస్తుందో చూడాలి.