కన్నడ సినిమా ‘వ్రిత్రా’ నుంచి రష్మిక తప్పుకోవడానికి కారణం ఎవరు? తాను ‘వ్రిత్రా’లో నటించడం లేదని రష్మిక తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరైన పని కాదని తనకు తెలుసునని, ఎంతో ఆలోచించి ‘వ్రిత్రా’ దర్శక, నిర్మాతలతో చెప్పగా వారు అర్థం చేసుకున్నారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే… ‘వ్రిత్రా’ నుంచి ఆమె తప్పుకోవడం వెనుక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి వున్నాడని కన్నడ పరిశ్రమ గుసగుస.’వ్రిత్రా’ దర్శకుడు గౌతమ్, రక్షిత్ స్నేహితులు. రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం రద్దు కావడంతో ఆమెతో పని చేయడం గౌతమ్కి ఇష్టం లేదని, స్నేహితుడి కోసం ఆమెను సినిమా నుంచి తప్పించారని సదరు గుసగుసల సారాంశం.
రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకున్న కారణంగా కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను దూరం పెట్టాలని అనుకుంటున్నట్టు కొందరు రాశారు. ఈ నోటా ఈ నోటా ఈ పుకార్లు రష్మిక చెవిన పడ్డాయి. దాంతో సోమవారం ఉదయం ‘వ్రిత్రా’లో నటించడం లేదని తెలిపిన రష్మిక, అర్ధరాత్రి దాటాక ఈ పుకార్లపై స్పందించక తప్పలేదు. ఓ రకంగా మండిపడ్డారు. ఆమెపై వస్తున్న కథనాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు.
“చాలా రోజుల నుంచి నేను మౌనంగా వున్నాను. కానీ, నాపై వస్తున్న కథలు, కథనాలు, కామెంట్స్, ట్రోల్స్… అన్నిటినీ చూస్తున్నా. నన్ను చిత్రీకరిస్తున్న విధానం పట్ల కలత చెందాను. అలాగని, నేను ఎవర్నీ నిందించడం లేదు. ఎందుకంటే… అలా జరిగి వుంటుందని మీ నమ్మకం. అయితే… నేను ఏది నిజం? ఏది అబద్ధం? అని చెప్పడానికి నేను ఇక్కడ లేను. ఒక్క మాత్రం చెబుతున్నా… ఎవరికీ ఇటువంటి పరిస్థితి రాకూడదు. నాణేనికి రెండు ముఖాలు వుంటాయి. అలాగే, ప్రతి కథకి రెండు కోణాలు వుంటాయి. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. చివరగా ఓ మాట.. కన్నడ సినిమాలు చేస్తుంటాను. కన్నడ సినిమాల్లో కంటిన్యూ అవుతాను. నేను ఇక్కడ వుంటాను. ఏ భాషలోనైనా… ఏ ఇండస్ట్రీలోనైనా… నా బెస్ట్ ఇస్తా” అని సోషల్ మీడియాలో రష్మిక పేర్కొన్నారు. బహుశా… ఇక్కడితో రష్మికపై వస్తున్న కథనాలు ఆగుతాయని ఆశిద్దాం!!