ఎలుక చాలా తెలివిగలది. పాస్ పోర్ట్, వీసా, ఎయిర్ టికెట్ వంటివి ఏవీ లేకుండా విమానమెక్కేసి లండన్ చెక్కేద్దామనుకున్నట్లుంది. ముంబయి నుంచి లండన్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానంలోని ఆహారపదార్ధాలు నిల్వఉంచే రూమ్ లో చోటుసంపాదించుకుంది. ఎవ్వరూ తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తగా దాక్కుంది. మరో కొన్ని గంటలు అలాగే ఉంటే లండన్ వెళ్లేదే. కానీ ఈలోగా క్యాబిన్ సిబ్బంది కంట పడింది. అంతే, ప్రయాణీకుల భద్రత కోసం సగం దూరం వెళ్ళిన విమానాన్ని వెనక్కి మళ్ళించారు. అసలు విషయంలోకి వెళితే….
డిసెంబర్ 30 (బుధవారం) ఉదయం 7 గంటలకు ముంబయి విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం (AI 131) లండన్ కు బయలుదేరింది. విమానం సగం దూరం వెళ్ళాక అందులో ఎలుక ఉన్నట్లు సిబ్బందిలో ఒకరు గమనించారు. ఈ విషయం తెలియగానే పైలట్ ముంబయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కు తెలియజేశాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసీఎ) నిబంధనల ప్రకారం విమానాన్ని వెనక్కి మళ్ళించారు. దీంతో అది తిరిగి మధ్యాహ్నం 12-50కి ముంబయి చేరుకుంది. ప్రయాణీకుల క్షేమానికే పెద్దపీట వేయడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ప్రయాణీకులను మరో విమానం ఎక్కించి లండన్ కు పంపించారు. ఎలుక దూరిన విమానాన్ని సుదూరంలోని పార్కింగ్ ప్లేస్ కు తీసుకెళ్ళి అక్కడ పెస్టిసైడ్స్ తో కూడిన పొగ వెదజల్లుతూ ఎలుకను చంపే ప్రయత్నం చేశారు.
ఇంతా చేస్తే, ఆ విమానంలోకి ఎలుక జొరబడినట్లు ఎవ్వరూ రూఢీగా చెప్పడంలేదు. అలాంటిదేదో కనిపించిందని మాత్రం సిబ్బంది చెప్పారట. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తున్నారు. గతంలో (జులై 30) ఇలాంటి సంఘటనే జరిగింది. ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి మిలాన్ బయలుదేరిన రెండు గంటలకే ఎలుక ఉన్నదన్న అనుమానంతో వెనక్కి వచ్చేసింది.
డిజిసీఏ నిబంధనల ప్రకారంగా ఎలుక లేదా అలాంటి జంతువు ఏదైనా జొరబడినట్లు తెలిస్తే, ఆ విమానాన్ని ముందుకు పోనీయకూడదు. దీన్ని `నో గో’ నిబంధన అంటారు. అయితే డిజిసీఏ ముందుకు పోనియకూడదని చెప్పిందేకానీ, ఇలా వెనక్కి తిప్పాలని చెప్పలేదని, ఫైలెట్ తప్పుగా అర్థం చేసుకున్నాడని ఎయిర్ సెఫ్టీ నిపుణులు అంటున్నారు. డిజిసీఏ రూల్ లోని సారాంశమేమంటే, ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు దగ్గర్లోని విమానాశ్రయంలో దింపేయడమేనని సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అడ్వయిజరీ కౌన్సిల్ (సీఏఎస్ ఏసీ) మాజీ సభ్యుడొకరు చెబుతున్నారు. 2010లో మంగళూరు వద్ద విమాన దుర్ఘటన జరిగిన దరిమలా ప్రభుత్వం ఈ సలహా మండలిని ఏర్పాటుచేసింది.
ఇలా విమానాన్ని వెనక్కి తిప్పేయడం వల్ల అదనంగా కొన్ని గంటలపాటు ప్రయాణీకుల సురక్షణ బాధ్యతలను సిబ్బంది వహించాల్సివచ్చింది. ఈలోగా వారికి ఆహార పానీయాలు ఇవ్వాల్సి వచ్చింది. ఒక వేళ ఎలుక కారణంగా ఆహారపదార్ధాలు చెడిపోయి ఉంటే అది ప్రయాణీకులకు ఇబ్బందే. ఇలాంటి కోణాలను కూడా పరిగణలోకి తీసుకుని పైలెట్స్ కు మరింత స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.