వ్యాపారం అంటే డబ్బు సంపాదిస్తేనే విజయం సాధించినట్లు అనుకుంటారు. పారిశ్రామికవేత్తలయితే కుబేరులవడమే అసలైన సక్సెస్ అనుకుంటారు. కానీ అసలైన వ్యాపారవేత్త, పారిశ్రామిక వేత్త ఎంత డబ్బు వెనకేశాం అని చూడరు. ఎంత ఉత్పాదకత తెచ్చాం… ఎంత మందికి ఉపాధి కల్పించాం.. దేశానికి ఎంత మేలు చేశాం అన్నదే చూస్తారు. అదే అసలైన సంపద. ఇలా చూసిన అతి కొద్ది మంది పారిశ్రామిక వేత్తల్లో రతన్ టాటా ముందు వరుసలో ఉంటారు.
వృద్దాప్యం వల్ల వచ్చిన సమయంలో రతన్ టాటా 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన టాటా గ్రూపు రోజువారీ వ్యవహారాలను చూడటం లేదు. టాటా గ్రూపు కంపెనీలను జేఆర్డీ టాటా ప్రారంభించి ఉండవచ్చు కానీ దాన్ని విశ్వవ్యాప్తం చేసి మల్టీ నేషనల్ కంపెనీగా మార్చింది మాత్రం రతన్ టాటా. అందుకే నూటికి 90 శాతం మంది టాటా గ్రూపు అంటే రతన్ టాటానే గుర్తు చేసుకుంటారు. ఆ గ్రూపును అంతర్జాతీయ బ్రాండ్లకు ఓనర్ గా కూడా చేసి రతనే.
ఇప్పుడు మన జీవితంలో టాటా గ్రూపు తీసివేయలేని ముద్ర వేసింది. వాటర్ ప్లస్ అనే వాటర్ బాటిల్స్ నుంచి విమానయానం వరకూ ప్రతి రంగంలో మనకు టాటా సేవలు అందుతున్నాయి. కాలానికి తగ్గట్లుగా కంపెనీ వ్యూహాలు మార్చి ప్రజా జీవితంలోకి చొచ్చుకెళ్లడంతో టాటాది ప్రత్యేకమైన పాత్ర. వ్యాపార పరంగా ప్రతి రోజూ అప్ డేటెట్గా ఉండేవారు. భవిష్యత్ ఉంటుందని తనకు నమ్మకం కలిగించే యువ టెకీలకు పెట్టుబడి అందించేందుకు సిద్ధంగా ఉండేవారు. ఇలా రతన్ టాటా పెట్టుబడి సాయం చేసిన కంపెనీ వృక్షాలుగా ఎదుగుతున్నాయి కూడా.
రతన్ టాటా ఎన్ని విజయాలు సాధించినా ఆయన ఎప్పుడూ బిలియనీర్ల జాబితాలో కనిపించరు. ఎదుకంటే ఆయన డబ్బు కోసం టాటా గ్రూప్ ను నడపలేదు. ప్రభుత్వంతో ఎప్పుడైనా లాలూచీ పడిందనే ఆరోపణలు ఎదుర్కోలేదు. విలువలతో కూడిన పారిశ్రామిక పయనం ఆయన సొంతం. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఇదే ఎవరూ సంపాదించలేని అతి పెద్ద సంపద. అది రతన్ టాటా సాధించారు. ఆయన భావి పారిశ్రామిక వేత్తలకు వెలుగు దిక్సూచీ.