వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీసు ఉన్నతాధికారి రూటే సెప’రేటు’ గా వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం ఆయన పరిధిలోని స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక రూల్స్ సైతం రూపొందించారు. టార్గెట్లు విధించి నెలకు ఒక్కో స్టేషన్ నుంచి 30వేల చొప్పున చెల్లించాలని కండిషన్ పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను కోరిన విధంగా ముడుపులు ఇవ్వని స్టేషన్ అధికారులను ముప్పు తిప్పలు పెడతారని విమర్శలు ఉన్నాయి. తన మాటకు అడ్డు చెప్పే వారిని టార్గెట్ చేసి తిట్ల వర్షం కురిపిస్తారని స్థానికంగా టాక్ నడుస్తోంది. దీంతో ఆ అధికారితో ఎందుకొచ్చిన తంటా..?అని కొంతమంది నెలకు 30వేల చొప్పున మూటజెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసుతో సంబంధం లేదు. ముడుపులు పొందటమే సదరు అధికారి ఎజెండా. ఏ కేసు ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ముందే గుర్తించి ఆ స్టేషన్ అధికారికి కేసు మెరిట్ తో సంబంధం లేకుండా ఆదేశాలు ఇస్తారనే విమర్శలు ఉన్నాయి. చేతులు తడిపిన వారికి అనుకూలంగా కేసును ముందుకు తీసుకెళ్లడం ఈ అధికారి ప్రత్యేకత. ముడుపులు చెల్లిస్తే భూవివాదాలను వెంటనే పరిష్కరిస్తారని సదరు అధికారి దగ్గరికి అధిక శాతం క్యూ కడుతారని తెలుస్తోంది. ఈ అధికార ధన దాహానికి భూబాధితులు తమ విలువైన ఆస్తులను కోల్పోయారని తెలుస్తోంది.
కాకతీయ వర్సిటీ పరిధిలోని భూవివాదంలో నకిలీపత్రాలతో వచ్చిన వారికి అండగా ఉన్నాడని.. ఆ కేసు కోర్టు పరిధిలో ఉండగానే ఆ స్థలంలో తన అధికారాన్ని ఉపయోగించి గోడ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేశారని అధికారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. దాంతో సదరు అధికారి ఎంతమంది అధికారులను మేనేజ్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది.
కేయూ పరిధిలోని వడ్డేపల్లి ఏరియాలో ఓ స్థలం వివాదంలో ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఎలాంటి ఆదేశాలు లేకపోయినా ఆ వివాదాస్పద స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణానికి అధికారి అనుమతిచ్చారని తెలుస్తోంది.
ఇరవై ఏళ్ల కిందట పలివేల్పులలో స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి కాకుండా… తప్పుడు పత్రాలను సృష్టించిన రియల్టర్ కి అధికారి సహకరించినట్లు సమాచారం. ఈ విషయమై కొనుగోలు చేసిన వారు న్యాయం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ వసూళ్ల పర్వం శృతి మించిపోయినట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే అందరూ ఆయన ఆదేశాల మేరకే పని చేస్తారనే అనుమానంతో ఎవరూ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదని తెలుస్తోంది.