Rathnam Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ : 2/5
-అన్వర్
విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు… దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది ‘రత్నం’. ట్రైలర్ చూడగానే ఇది విశాల్ -హరి మార్క్ యాక్షన్ మూవీ అని అర్ధమైయింది. మరి ఈ యాక్షన్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉందా? విశాల్ ఖాతాలో మరో హిట్ పడిందా?
చిత్తూరులో పేరు మోసిన రౌడీ షీటర్… పన్నీర్ (సముద్రఖని). ఓ రాత్రి కూరగాయల మార్కెట్ లో పన్నీర్ పై హత్యాయత్నం జరుగుతుంది. ఈ ఘటన నుంచి అతడ్ని ప్రాణాలతో కాపాడుతాడు పదేళ్ళ పిల్లాడు రత్నం (విశాల్). ఆ ప్రయత్నంలో ఓ హత్య చేస్తాడు రత్నం. కాలం గడుస్తుంది. జైలు శిక్ష అనుభవించి బయటికివస్తాడు రత్నం. ఈలోగా పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. బయటికి వచ్చిన రత్నం, పన్నీర్ కి కుడి భుజంగా మారి సెటిల్మెంట్లు చేస్తుంటాడు. మల్లిక (ప్రియా భవాని శంకర్)కు డాక్టర్ అవ్వాలని కల. తను నిట్ పరీక్ష రాయడానికి చిత్తూరు వస్తుంది. అనుకోకుండా మల్లికని చూసిన రత్నం.. తనని ఎక్కడో చుశానని ఆమెను వెదుక్కుంటూ వెళ్తాడు. కాలేజ్ లో పరీక్ష రాయడానికి వెళ్తున్న మల్లికపై అనూహ్యంగా కొందరు రౌడీలు దాడి చేస్తారు. ఆ దాడి నుంచి మల్లికని కాపాడుతాడు రత్నం. ఇంతకీ ఈ మల్లిక ఎవరు? ఆమెపై ఎందుకు దాడి జరిగింది ? రత్నం, మల్లికను ఎందుకు వెదుక్కుంటూ వెళ్ళాడు? రత్నం గతం ఏమిటి? ఈ కథలో లింగం( మురళీశర్మ) పాత్ర ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
మాస్ యాక్షన్ సినిమాల్లో కొత్తదనం చూపించడం అంత తేలిక కాదు. ఈ జోనర్ కథలన్నీ దాదాపు ఒకే పంథాలో సాగుతుంటాయి. అంతిమంగా హీరో, విలన్స్ ని అంతం చేయాలి. దాదాపు కథలన్నీ ఈ లైన్ తో తయారౌతాయి. దర్శకుడు హరి ఈ తరహా కథలు గతంలో బోలెడు తీశారు. తను ఎంచుకున్న ఆ పాయింట్ తోనే క్యారెక్టరైజేషన్, కాన్ఫ్లిక్ట్ లో కొత్తదనం చూపిస్తూ కొన్ని విజయాలు కూడా అందుకున్నారు. రత్నం కూడా ఓ మాస్ యాక్షన్ కథే. అయితే ఇందులోనే క్యారెక్టరైజేషన్, కాన్ ఫ్లిక్ట్.. ఇదివరకే ప్రేక్షకులు చూసిన అనుభూతి కలగడంతో సినిమా ప్రయాణం చాలా వరకూ రొటీన్ వ్యవహారంగా మారింది.
దారి దోపిడీ ఎపిసోడ్ తో కథ ఆసక్తికరంగానే మొదలౌతుంది. హరి సినిమాల్లో వుండే వేగం ఇందులో కూడా కనిపిస్తుంది. హీరో జైలుకి వెళ్ళడం, మళ్ళీ రావడం, హీరోయిన్ ని కలవడం, హీరోయిన్ కు వచ్చే ఆపద…వీటితో చకచక కథనం నడుస్తుంది. ఇందులో హీరో, హీరోయిన్ ట్రాక్ ని కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు హరి. వారి మధ్య ‘ప్రేమ’ని అమ్మ ప్రేమగా చూడటం, ఆద్యంతం దానికే కట్టుబడి వుండటం రొటీన్ కి కాస్త భిన్నంగానే వుంది.
అయితే ఎంతటి యాక్షన్ సినిమా అయినా డ్రామా వుంటేనే పడుతుంది. ప్రేక్షకుడి ద్రుష్టిని ఆకర్షించాలంటే కథలో లీనం చూసే డ్రామా వుండాలి. రత్నంలో అది కొరవడింది. ఫస్ట్ హాఫ్ లో నాలుగు, సెకెండ్ హాఫ్ లో ఇంకో నాలుగు భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మధ్య ఏదో పిల్లర్ గా డ్రామా వుంది కానీ అది సహజంగా కథలో ఇమడలేదు. పైగా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులు, పోలీసుల వ్యవహారం అనవసరమైన గందరగోళంగా మారిపోయింది. సెకండ్ హాఫ్ అయితే హరి ట్రీట్మెంట్ కి భిన్నంగా సాగుతుంది. నిజానికి హరి సినిమాల్లో లాగ్ వుండదు. కానీ రత్నంలో కథ అక్కడక్కడే తిరుగుతూ కాస్త సాగదీత వ్యవహారంగా మారింది. హీరోయిన్ ని రౌడీల నుంచి కాపాడే హీరో సింగిల్ ఎజెండా ఒక దశలో బోర్ కొట్టేస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్ వుంది. కానీ హీరో పాత్రని రౌడీ గ్యాంగ్ తో ముడిపెట్టిన ఒక ట్విస్ట్ మాత్రం టూమచ్ సినిమాటిక్ గా వుంది.
విశాల్ కి ఇలాంటి పాత్రలు కొత్తకాదు. రత్నం తనకు అలవాటైన పాత్రే. యాక్షన్ సీన్స్ లో తన యీజ్ చూపించాడు. తన కష్టం తెరపై కనిపించింది. కానీ ఎమోషన్స్ సీన్స్ లో ఓవర్ డ్రమటైజ్ చేసినట్లుగా అనిపించింది. ప్రియా భవానీ శంకర్ ది కీలకమైన పాత్ర. కథ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తన లుక్స్ ఆ పాత్రకు సరిపోయాయి. అయితే ఎంతసేపూ ఒకటే ఎక్స్ ప్రెషనా అన్నట్టుగా కొన్ని సీన్లు అనిపిస్తాయి. ఆమె పాత్రలో మరో కోణం కూడా వుంది. అది తెరపైనే చూడాలి. సుముద్రఖని తనకు అలవాటైన పాత్రలో సహజంగా చేశారు. మురళీ శర్మకు ఇది వెరైటీ పాత్రనే. ఆ పౌడర్ రాసే మ్యానరిజం కొంచెం కొత్తగానే వుంది. యోగి బాబు అక్కడక్కడ నవ్విస్తాడు.
రత్నం యాక్షన్ సీక్వెన్స్ లు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సాలిడ్ గా డిజైన్ చేశారు. రెండు ఛేజింగ్ సీక్వెన్స్ అలరిస్తాయి. ఫైట్స్ లో హింస ఎక్కువైపోయింది. తలలు, కాళ్ళు ఎగిరిపడే సన్నివేశాలు కోకొల్లలుగా వున్నాయి. రక్త పాతం మాత్రం శ్రుతిమించింది. దేవిశ్రీ నేపధ్య సంగీతం యాక్షన్ ని ఎలివేట్ చేసింది. కెమరాపనితనం యాక్షన్ సినిమాకి తగ్గట్టుగా వుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగానే వుంది.
కేవలం యాక్షన్ పైనే ఆధారపడి దర్శకుడు హరి డ్రామా ఎమోషన్ బలంగా పట్టుకోలేదనిపించింది. యాక్షన్ ఎలివేట్ అయినంతగా.. హీరోయిన్ లో తల్లి ప్రేమ చూసుకునే హీరో ఎమోషన్ వర్క్ అవుట్ అయ్యింటే ‘రత్నం’ మెరిసేది. కానీ అలా జరగలేదు.
ఫినిషింగ్ టచ్: ‘రత్న’పాతం!
తెలుగు360 రేటింగ్ : 2/5
-అన్వర్