తెలంగాణలో ఇక ఇప్పుడు రేషన్ కార్డు రాజకీయం స్టార్ట్ కాబోతుంది. అవును… ఏ అవకాశం దొరుకుతుందా… అటాక్ చేయాలన్నట్లుగా కేటీఆర్, బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా రెడీగా ఉంది. కాంగ్రెస్ సర్కార్ తాజాగా రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకొని, మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో… రేషన్ కార్డు ప్రమాణికంగా ఉంది.
ప్రజా పాలన దరఖాస్తు సమయంలోనూ రేషన్ కార్డు ఉంటేనే అర్హుల గుర్తింపు అన్న కండీషన్ సర్కార్ పెట్టింది. దీంతో రేషన్ కార్డులు లేని వారు చాలా మంది ఉన్నారు, వారికి ఇవ్వరా అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యింది. ఆ తర్వాత రెండు పార్టీలు మర్చిపోయాయి.
మొన్నటి వరకు పరీక్షల వాయిదా, పోస్టులు పెంచాలన్న డిమాండ్ తో ఉన్న బీఆర్ఎస్… అవి సాధ్యం కావని సర్కార్ స్పష్టం చేసిన నేపథ్యంలో రుణమాఫీ అంశంపై ఫోకస్ చేసింది. నిజానికి గతంలో రుణమాఫీ చేస్తానని… చివరి వరకు లాగి, చేతులెత్తేసింది కేసీఆర్ సర్కార్. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకొని మరీ, ఏకకాలంలో రుణమాఫీకి కార్యాచరణ ప్రారంభించారు.
రేషన్ కార్డుల విషయంలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. రేషన్ కార్డుల జారీ ఒక్క సంతకంతో అయ్యే పని కాదు. ఆ విషయం బీఆర్ఎస్ నాయకులకు కూడా తెలుసు. అందుకే గడిచిన 10ఏళ్లలో కొత్త కార్డులు మంజూరు కాలేదు. కానీ, ఇప్పుడు కొత్త సర్కార్ కూడా రేషన్ కార్డుకే పథకాలు ముడిపెట్టడం, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ఇంకా పెండింగ్ లోనే ఉన్న నేపథ్యంలో… రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే అవకాశం ఉంది.