ప్రజలకు ఇంటి వద్దకే రేషన్ అందించాలనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం గురి తప్పినట్లుగా కనిపిస్తోంది. మొదటికే మోసం వస్తూండటం… లబ్దిదారుల్లో తీవ్ర ఆగ్రహం కనిపిస్తూండంతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా… ఈ విధానం వద్దని.. పాత విధానమే తీసుకు రావాలని డిమాండ్ చేయడం ప్రారంభిస్తున్నారు. వైసీపీలో ఉన్న భిన్నమైన పరిస్థితుల్లో నేరు తెరిచేవారు తక్కువ. అలా తెరవగలిగే స్వేచ్చ ఉన్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి… వాహనాల ద్వారా రేషన్ బియ్యం సరఫరా నిలిపివేయాలి.. పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ చేయాలని మీడియా ముందు నేరుగా డిమాండ్ చేశారు. ఇది సీఎం దగ్గరకు చేరుకుంది. నేరుగా చెప్పడానికి సీఎం అపాయింట్మెంట్ ఇచ్చేది తక్కువ.
మంత్రాలయం ఎమ్మెల్యే సమస్య మాత్రమే కాదు.. దాదాపుగా ప్రతి ఎమ్మెల్యే ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వారికి లబ్దిదారుల నుంచి ఒత్తిడి వస్తోంది. గతంలో కార్డు దారులు.. తమకు అవకాశం ఉన్నప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి తెచ్చుకునేవారు. ఇప్పుడు వాహనం కోసం ఎదురుచూస్తూ ఉండాల్సి వస్తోంది. అదీ కూడా ఇంటి దగ్గరకు రావడం లేదు. రేషన్ పంపిణీలో ప్రతీ పని కష్టంగానే మారుతోంది. ఈ పోస్ యంత్రానికి నెట్ వర్క్ అందకపోతే.. చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిణామాలతో.. లబ్దిదారులకు ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది.
ఇంతా చేసినా… ఈ పథకం మొత్తంలో భాగస్వాములు అయిన ఎవరైనా సంతోషంగా ఉన్నారా అంటే ఎవరూ లేరు. అటు రేషన్ డీలర్లు అసంతృప్తిలో ఉన్నారు. తమ ఉపాధిని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డెలివరీ చేయడానికి వాహనాలు పొందిన వారు మరింత కష్టాల్లో పడ్డారు. ఆ చాకిరీ చేయలేమని వాహనాలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాల్లో ఉన్న సమస్యలను చూస్తే.. పరిష్కరించలేనివిగా ఉన్నాయని.. మళ్లీ పాత విధానమే అమలు చేయడం మంచిదన్న అభిప్రాయం.. వైసీపీలోనే ఎక్కువగా వినిపిస్తోంది. లబ్దిదారుల్లో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఏర్పడితే ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకోక తప్పదేమో..?