ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా దాదాపుగా రూ. వెయ్యి కోట్లు వెచ్చించి ప్రారంభించిన సంక్షేమ రథాలు… ఇంటింటికి రేషన్ అందించడంలో బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ అంటే నిన్నటి నుంచి ఈపథకం ప్రారంభమయింది. గ్రామాల్లో ప్రారంభంకాలేదు. పట్టణాల్లో మాత్రం ప్రారంభం అయింది. పట్టణాల్లో.. ఈ సంక్షేమ రథాలు బియ్యం తీసుకుని సైరన్ మోగించుకుంటూ ఓ వీధిలోకి వెళ్తాయి. అందరూ అక్కడికే వచ్చి రేషన్ తీసుకుంటున్నారు. దీంతోఆ వాహనాల దగ్గర క్యూ లైన్లు కనిపించాయి. ఇంటింటికి ఇచ్చుకుంటూ పోతే ఆలస్యం అవుతుందని… వాహనాల దగ్గరకే లబ్దిదారులు స్వచ్చందంగా తరలి రాగా… మరికొన్ని చోట్ల… వాహనదారులే పిలుచుకొచ్చి ఇచ్చారు.
పథకం ఉద్దేశం… ఇంటింటికి వెళ్లి ఇవ్వడం. ఇలా ఓ పాయింట్లో బండి ఆగితే… లబ్దిదారులే అక్కడికి వెళ్లి తీసుకుంటే పథకం ఉద్దేశం దెబ్బతింటుంది. కొన్ని చోట్ల వాహనాదారులు ఇంటికి వెళ్లి ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల చేశారు కూడా. ఆ పద్దతిలో కొనసాగితే.. లబ్దిదారులకు బాగానే ఉంటుంది. అయితే.. వాహనాలు పట్టని కాలనీలు పట్టణాల్లో కొన్ని ఉంటాయి. కొండ ప్రాంతాలా ఉన్న కాలనీలు ఉన్నాయి. అలాంటి చోట్ల.. వాలంటీర్లు వెళ్లి ఇచ్చి రావాల్సి ఉంది. కానీ ఆ బాధ తమకెందుకని కొంత మంది లబ్దిదారుల్నే కిందకు పిలుపుస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా గ్రామాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభం కాలేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఒక వేళ వాహనదారులు.. తమకెందుకు కష్టం అని ఓ పాయింట్లో బండిని నిలబెట్టి.. అందర్నీ అక్కడికే వచ్చి తీసుకోవాలని చెబితే… పథకం ఉద్దేశం దెబ్బతిన్నట్లే. ఎందుకంటే… రేషన్ దుకాణాలుఅంతకు ముందు ఎంతో దూరంలో ఉండేవి కాదు. సమీపంలోనే ఉండేవి. ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకునే చాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు… రేషన్ దుకాణాల్లో ఇవ్వరు. బండి ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టమన్నట్లుగా పరిస్థితి్ మారిపోతుంది.