బిజెపి జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఎంపీ స్థానానికి మాజీ ఐఏఎస్ రత్న ప్రభ పోటీ చేస్తున్నారు. అయితే రత్నప్రభ ని అభ్యర్థి గా ప్రకటించిన నాటి నుండి సోషల్ మీడియాలో ఈవిడ జగన్ మద్దతుదారు అని, వైఎస్ఆర్సిపి బిజెపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనం అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అధికారికంగా స్పందించారు మాజీ ఐఏఎస్ రత్నప్రభ. వివరాల్లోకి వెళితే
రత్నప్రభ అభ్యర్థిత్వం పై జరుగుతున్న ప్రచారం:
తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్న ప్రభ ని బీజేపీ ప్రకటించింది. ఈవిడ ఎడ్యూరప్ప హయాంలో కర్ణాటకలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన వెంటనే కర్ణాటక లోని బిజెపిలో చేరారు. ఇప్పుడు తిరుపతి ఎంపీ స్థానానికి ఆవిడ పేరు ప్రకటించగానే సోషల్ మీడియా గతంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలను బయటకు తీసింది. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులో ఈవిడ పేరు కూడా నిందితురాలిగా చేసినప్పటికీ ఈవిడ ఆ కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. ఆ తర్వాత 2019లో జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ ను అభినందిస్తూ ఆవిడ ట్వీట్ చేశారు. పదేళ్ల కిందట వైఎస్ఆర్ చనిపోతే 10 ఏళ్ళ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అని , ఈ రోజు నిజంగా వైయస్సార్ ఆత్మ శాంతించి ఉంటుందని ఆవిడ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కూడా జగన్ పథకాలను అభినందిస్తూ ఆవిడ ట్వీట్ చేశారు. అప్పట్లో ఆవిడ చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పైగా ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నేతలు అధికార వైఎస్ఆర్సిపి తో సన్నిహితంగా మెలుగుతున్నారు అని, ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాల్సింది పోయి అధికార పార్టీతో కుమ్మక్కై ఆ పార్టీకి మేలు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా బిజెపి వైఖరిపై అసహనం గా ఉన్నాడని, తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి పవన్ కళ్యాణ్ రాకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, తాను జగన్ మద్దతుదారు అన్న ప్రచారంపై , అదే విధంగా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వం పట్ల సంతృప్తిగా లేదన్న ప్రచారం పై స్పందించారు రత్నప్రభ.
రత్న ప్రభ స్పందన :
తన మీద జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, తాను నిజాయితీపరులు అని, తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని, రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఇటువంటి విమర్శలు సహజమే అని వ్యాఖ్యానించారు రత్నప్రభ. అదే విధంగా గతంలో తాను చేసిన ట్వీట్ల ఆధారంగా తాను జగన్ మద్దతుదారు అనుకోవడం సరికాదు అని ఆవిడ వ్యాఖ్యానించారు . ఏదైనా ఒక పని మంచిది అయినప్పుడు దాన్ని మంచి పని అని చెప్పినంత మాత్రాన జగన్ మద్దతుదారు అని భావించాల్సిన అవసరం లేదని ఆవిడ వ్యాఖ్యానించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు తన అభ్యర్థిత్వం ఇష్టం లేదు అన్న ప్రచారంపై కూడా ఆవిడ స్పందించారు. అవన్నీ కేవలం రూమర్స్ అని, తన అభ్యర్థిత్వం పట్ల పవన్ కళ్యాణ్ రెండు వందల శాతం సంతృప్తిగా ఉన్నారని ఆవిడ అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తానని కూడా తనతో అన్నారని రత్నప్రభ వ్యాఖ్యానించారు . జనసైనికుల మద్దతు తనకు ఉంటుందని కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తానికి తన మీద జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి అంతటికీ ఆవిడ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, ఆ అభ్యర్థికి ఇదే మొదటి ఎన్నికలు కావడం బిజెపి కి ప్రతికూలంగా మారనుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి కొత్తవారు అయినప్పుడు పార్టీ వైపు నుండి ఉండాల్సిన దూకుడు కూడా ఇప్పటివరకు ఏపీ బిజెపి తరఫునుంచి కనిపించడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే జాతీయ నాయకత్వం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి ఏవో కుంటి సాకులు చెప్పి రావడం మానేస్తే గనుక, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి వైఎస్ఆర్సిపి ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్న ప్రచారం మరింత బలపడే అవకాశం ఉంది. అదే జరిగితే బిజెపి అభ్యర్థి డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కష్టమే. మరి రత్నప్రభ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది కొద్ది వారాల్లో తేలనుంది.