తిరుపతి బీజేపీ అభ్యర్థిగా కర్నాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను దాదాపుగా ఖరారు చేశారు. అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. అయితే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అధికారిక ప్రకటన మాత్రం ఆలస్యం అవుతోంది. దీనికి కారణం ఏమిటన్నదానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి బరిలో ఉండాల్సింది ఉమ్మడి అభ్యర్థి కాబట్టి.. పవన్ కల్యాణ్అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ రత్నప్రభ అభ్యర్థిత్వం విషయంలో ఏమంత సానుకూలంగా లేనట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం రత్నప్రభ.. వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండటమే కారణం అని భావిస్తున్నారు. రత్నప్రభ వైఎస్ హయాంలో కర్నాటక నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చి పని చేశారు.
పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ ఇరుక్కున్నారు. తర్వాత ఆమె ఐఏఎస్ హోదాలో రిలీఫ్ వచ్చింది. దాంతో కర్ణాటక క్యాడర్‌కు వెళ్లిపోయారు. అక్కడ సీఎస్‌గా కూడా పని చేశారు. రిటైరయ్యారు. అయితే.. ఎప్పుడూ ఆమె సోషల్ మీడియాలో వైఎస్‌ను పొగుడుతూ ఉంటారు. జగన్ గెలిచినప్పుడు.. ఇంగ్లిష్ మీడియం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆమె ట్వీట్ల ద్వారా జగన్‌ను పొగడటానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు అవన్నీ వైరల్ అవుతున్నాయి. వైఎస్ వీరాభిమానిని … బీజేపీ తరపున నిలబెట్టడం ఏమిటని.. అదీ కూడా వైసీపీ ప్రత్యర్థిగా నిలబెట్టడం ఏమిటని… ఇది ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందన్న అభిప్రాయంతో జనసేన వర్గాలు ఉన్నాయి.
రత్నప్రభను నిలబెడితే.. పవన్ కల్యాణ్ ప్రచారం చేయడం.. కష్టమేనన్న చర్చ కూడా నడుస్తోంది. ఎలాగైనా పవన్ కల్యాణ్‌ను ఒప్పించి అభ్యర్థిని ప్రకటించాలన్న పట్టుదలతో ఏపీ బీజేపీ నేతలు ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఉంది. మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఇప్పటి వరకూ బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో సందిగ్ధం ఏర్పడింది. ఇలా అయితే.. అభ్యర్థి రేసులో ఉండటం కూడా కష్టమన్న చర్చ బీజేపీలో నడుస్తోంది.