వైజాగ్-విజయవాడ మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఈరోజు నుంచి మళ్ళీ పట్టాలు ఎక్కబోతోంది. జనవరి 31వ తేదీన ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తూర్పు గోదావరి జిల్లా, తునిలో జరిగిన కాపు గర్జన సభ అనంతరం ఆందోళనకారులు దానిని తగులబెట్టారు. వేరే రైలు, బోగీలు అందుబాటులో లేకపోవడంతో అప్పటి నుండి ఆ రైలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈరోజు నుండి మళ్ళీ దానిని నడిపిస్తున్నారు. అయితే ఇది వరకు మొత్తం 24 బోగీలు ఉండగా ఇప్పుడు 17 బోగీలు మాత్రమే ఉంటాయి. బోగీల కొరత కారణంగా అందుబాటులో ఉన్నవాటితోనే రైలుని నడిపిస్తున్నామని త్వరలోనే మిగిలిన బోగీలను కూడా ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
వైజాగ్-విజయవాడ మధ్య నడిచే ఈ రైలు, దాని సమయాలు కూడా చాలా సౌకర్యంగా ఉన్నందున ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తమ ప్రయాణాలకు దానిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. గత వారం రోజులుగా ఆ రైలు నిలిచిపోవడంతో వారందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు మళ్ళీ నేటి నుండి మళ్ళీ పట్టాలు ఎక్కింది. ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో రిజర్వుడు బోగీలు-8, సాధారణ బోగీలు-4, ఏసీ కార్ చైర్లు-2, ఎస్.ఎల్.ఆర్-2, ప్యాంట్రీ కార్ ఉంటాయి.