కిరణ్ అబ్బవరపు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. మంచి కథల్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. మంచి రిలీజ్ డేట్ చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో తేడా జరిగితే మొదటికే మోసం వస్తుంది. మొన్నటికి మొన్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా వచ్చింది. టాక్ బాగానే ఉంది.కానీ.. ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేదు. కారణం… రిలీజ్ డేట్ సరైనది ఎంచుకోకపోవడం వల్లే. ‘సార్’ లాంటి సినిమా ఉన్నప్పుడు.. ధైర్యం చేసి ‘వినరో..’ విడుదల చేశారు. సోలో రిలీజ్ అయితే.. కిరణ్ అబ్బవరం సినిమాకి ఇంకా మంచి వసూళ్లు దక్కేవి.
ఇప్పుడూ అలాంటి తప్పటడుగే వేస్తున్నట్టు కనిపిస్తోంది. తన తదుపరి సినిమా ‘మీటర్’ ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నాడు. అదే రోజున మాస్ మహరాజ్ `రావణాసుర` విడుదలకు రెడీ అయ్యింది. ఈ రెండు సినిమాల పోస్టర్లు పక్కపక్కన పెడితే, సగటు ప్రేక్షకుడి ఓటు.. రవితేజ సినిమాకే పడుతుంది. ఆ తరవాత కూడా ఓపిక, డబ్బులు ఉంటే.. అప్పుడు ‘మీటర్’ జోలికి వెళ్తారు. ఈ విషయం తెలిసి కూడా రవితేజ కి పోటీగా సినిమా దింపేస్తున్నాడు కిరణ్. అసలే రవితేజ ‘ధమాకా’తో సూపర్ హిట్టు కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. ఇలాంటి సమయంలో.. కిరణ్ రిస్క్ చేయడం అంత అవసరమా? అన్నది ఇండస్ట్రీ జనాల మాట.