వ్యక్తుల నేపథ్యాలూ ఏమైనప్పటికీ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. గతంలో వున్న చాలా ప్రమాణాలు ఇప్పుడు మటుమాయమైనా ఇప్పటికీ ప్రజలూ సమాజం మంత్రులు ఉన్నతాధికారులు పార్టీల అధినేతల నుంచి చవకబారు మాటలు వస్తే జీర్ణించుకోలేరు. కొన్నిసార్లు మాటలతోనే పదవులు పోయిన ఉదంతాలున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్ బాబు నోట వెలువడిన ఆణిముత్యాలు ఇప్పుడు అధికార పార్టీని అలాగే ఇబ్బంది పెడుతున్నాయి. ఆ పార్టీ ప్రముఖులు దళిత వర్గానికి చెందిన వారు కూడా సమర్థించలేని సహించరాని పరిస్థితిని తెచ్చిపెట్టారాయన. మొదట్లో రావెల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్పైన టిఆర్ఎస్పైన రాజకీయంగా దాడి చేస్తుండేవారు. అదే వూపులో జగన్ను కూడా చీల్చిచెండాడే వారు. ప్రత్యర్థులపై దాడి చేస్తూ తనను కీర్తించేవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తుంటారు. పైగా మీరెందుకు మాట్లాడ్డం లేదని ఇతరులకు ఆదర్శంగా చూపిస్తుంటారని ఆ పార్టీలో సీనియర్లు ఆలోచనాపరులు వాపోతుంటారు. ఎందుకంటే బయిటివారిని బాగా తిట్టిన వారే ఇప్పుడు ఇతర పార్టీలలో చేరి అంతకన్నా తీవ్రంగా ఆయనపై దాడి చేస్తున్నారు.
ఇక రావెల విషయానికి వస్తే – రాజధానిలో భూములు నా భార్య కొంటే తప్పేమిటని ఆయన ఎదురు దాడి చేశారు. అసైన్డు భూములు కొంటే తప్పేంటి అని కూడా అనుచిత సవాళ్లు విసిరారు. తన కుమారుడు సుశీల్ కుమార్ అనుచిత ప్రవర్తన విషయంలోనూ జాగ్రత్తగా మాట్లాడవలసింది పోయి జగన్కు అంటగట్టేందుకు ప్రయత్నించి అభాసుపాలైనారు. ఈ సమయంలో ఆపార్టీలో ముఖ్య నాయకుడు ఫోన్ చేస్తే మంత్రి గారు బదులిచ్చిన తీరుకు ఆయనే విస్తుపోతున్నారు. మరీ ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు? అని ఆగ్రహించారు. ఇక ముఖ్యమంత్రికి ఎప్పుడు కోపం వస్తుందో గాని.. రావెల నోటికి తాళం మాత్రం తప్పదు. ఇతరులు వేయకున్నా తనే వేసుకోవడం శ్రేయస్కరం.