తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతల తీరు ఇలానే ఉంటుంది..! పార్టీ తమను పూర్తిగా పక్కన పెట్టేస్తోందని అనిపించినా… వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా తగ్గుతోందని భావించినా, ఉనికి చాటుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. తమ అవసరం పార్టీకి ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్య అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా దాదాపు అలాంటి ప్రయత్నమే చేశారు. రాజీనామా చేస్తానని ప్రకటించి, తన డిమాండ్లు నెరవేర్చుకుని, టీడీపీలో తనకు ఉన్న పట్టు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇదే తరహాలో రావెల కిషోర్ బాబు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య టీడీపీలో ఆయనకు వరుసగా మైనస్ మార్కులు పడిపోతున్న సంగతి తెలిసిందే.
నిజానికి, టీడీపీలో అనూహ్యంగా కీలకంగా మారిన నేతల్లో రావెల కిశోర్ బాబు కూడా ఉండేవారు! గత ఎన్నికల్లో ఆయన తెరమీదికి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, ఆయనకి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే, అక్కడి నుంచే సీన్ మారింది. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం, కాంగ్రెస్ నేతలకు మద్దతుగా నిలుస్తుండటం వంటి ఆరోపణలు పార్టీ అధినాయకత్వం వరకూ చేరాయి. దీంతో మంత్రి వర్గ విస్తరణలో ఆయన పదవి పోయింది. అక్కడి నుంచీ పార్టీ అధినాయకత్వంపై రావెల కాస్త గుర్రుగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కొంత తగ్గించుకున్నారు. కానీ, ఎమ్.ఆర్.పి.ఎస్.కు తెర వెనక ఉండి సాయం చేస్తున్నట్టు ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఓపక్క మందా కృష్ణ మాదిగ నిర్వహించే సభలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే… ఇదే సమయంలో రావెల ఆయనకు ఆశ్రయం కల్పిస్తున్నారట! ఎమ్.ఆర్.పి.ఎస్. భవిష్యత్ కార్యాచరణ విషయమై కొంతమందితో రావెల చర్చించారనే సమాచారం కూడా పార్టీ అధినాయకత్వానికి చేరిందని సమాచారం.
ఇదే అంశమై ఇప్పుడు పార్టీలో చర్చనీయంగా మారుతోంది. టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారని కొంతమంది నేతలు ఆగ్రహిస్తున్నారు! పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించడం ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఎమ్మార్పీయస్ ఆందోళనకు మద్దతు ఇవ్వడం ద్వారా పార్టీకి ఇలాంటి సంకేతాలు ఇవ్వాలనేది ఆయన వ్యూహం అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయితే, జేసీ విషయంలో ఈ వ్యూహం పనిచేసిందేమోగానీ, రావెలకు వర్కౌట్ అయ్యే పరిస్థితులు పెద్దగా లేవు. ఎందుకంటే, జేసీ అవసరం పార్టీకి చాలా ఉంది. ఒక సామాజిక వర్గానికీ, అందునా రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతగా ఆయనకు అనుకూలించే అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి, ఆయన విషయంలో పార్టీ అధినాయకత్వం మెట్లు దిగి వచ్చిందనుకోవచ్చు. రావెల విషయంలో ఇదే తరహాలో పార్టీ వ్యవహరించే అవకాశాలు కాస్త తక్కువనే చెప్పాలి.