మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మాటల తీరు చూస్తుంటే తెలుగుదేశం నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కృతనిశ్చయంతో వున్నట్టు స్పష్టమవుతుంది. వర్ల రామయ్య వ్యాఖ్యలకు స్పందించిన రావెల కేవలం ఆయనకే పరిమితం కాకపోవడం ఇందుకు నిదర్శనం. వర్లకు అవగాహన లేదనీ, తనకూ వర్లకూ ప్రస్తుత మంత్రి జవహర్ ఎవరికి ఆదరణ ఎక్కువగా వుండో సర్వే చేయాలన్న సవాలుతో ఆయన ఆగలేదు. టిడిపి ప్రభుత్వంలో మాదిగలకన్న మాలలకు ప్రాధాన్యత పెరిగిందనే భావన బలపడుతున్నట్టు పేర్కొన్నారు. అలాటి భావన వున్నమాట నిజమే. కాపులనూ మాలలనూ మంచి చేసుకోవడానికి టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరీ ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారనేది ఆ పార్టీలో మాదిగ నేతల ఆవేదన, ఆరోపణ కూడా. ఇది రావెలకే పరిమితం కాదు. అయితే వ్యక్తిగత వివాదాలతో పదవి నుంచి తప్పించబడిన రావెల తిరుగుబాటుకు ఏ మాత్రం విశ్వసనీయత మద్దతు వుంటాయనేది సందేహం. ఈ లోటు భర్తీ చేసుకోవడానికే ఆయన మందకృష్ణ మాదిగ వెంట తిరుగుతున్నారు. కృష్ణ టిడిపి ప్రభుత్వంమీద తీవ్రంగా ధ్వజమెత్తుతుంటారు. ఆయన తలపెట్టిన కురుక్షేత్ర సభకు అనుమతినివ్వకపోవడం సరికాదని కూడా రావెల బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తనకు పదవులు పెద్ద లెక్క కాదని కూడా తీసిపారేశారు. మాదిగలకు తాగుబోతుల శాఖ ఇచ్చి మాలలకు సంక్షేమ శాఖ ఇచ్చారని ఆయన చేసిన ఆరోపణ విచిత్రంగా మరీ తమాషాగా వుంది. ఇవన్నీ చెప్పి తనకు ఎలాటి అసంతృప్తి లేదనీ, చంద్రబాబు వల్లనే రాజకీయ భవిష్యత్తు కలిగిందని చెప్పడం కేవలం జాగ్రత్త కోసం తప్ప గట్టి తిరుగుబాటుగానే ఆయన గొంతు వినిపించింది. దీనికి తగినట్టే గుంటూరులో జరిగిన జాషవా 122వ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తారని బాగా ప్రచారం జరిగినా చివరలో విరమించుకున్నారు. మాదిగ కార్యకర్తలు అక్కడ గొడవ చేయొచ్చనే సందేహంతోనే రావడం మానుకున్నట్టు ఒక ప్రచారం నడిచింది. సరిగ్గా ఆ సమయంలోనే పత్తిపాడులో రావెల మందకృష్ణ కలసి జాషవా విగ్రహావిష్కరణ తలపెట్టారు. మొత్తంమీద ఆయన ధోరణి చూస్తే అధిష్టానం నుంచి చర్యను ఆహ్వానిస్తున్నారా అని సందేహం కలుగుతుంది.