వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రకటిస్తున్న సోము వీర్రాజు మాటలను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు నమ్మలేదు. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని సోము వీర్రాజుకు పంపి మొబైల్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ కొంత కాలం యాక్టివ్గానే ఉన్నప్పటికీ రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకోకపోవడంతో కార్యకలాపాలు తగ్గించారు.
కేంద్ర ప్రభుత్వ అధికారిగా పని చేసిన రావెల కిషోర్ తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ప్రత్తిపాడు నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయనకు కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. అయితే వివాదాస్పద వ్యవహారశైలి కారణంగా మధ్యలోనే ఆయన పదవిని కోల్పోయారు. మంత్రి పదవిని తొలగించిన తర్వాత ఆయన టీడీపీపై విమర్శలు చేస్తూ వచ్చారు. చివరికి టిక్కెట్ ఇవ్వరని తెలిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.
ఇప్పుడు మళ్లీ రావెల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమరావతి ఉద్యమంతో పాటు.. అమరావతి రైతుల పాదయాత్రలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలతో మళ్లీ సన్నిహిత సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనను మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నదానిపై టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.