అటు చెంపదెబ్బ ఇటు గోడదెబ్బ అన్నట్లుగా తయారైంది తెలుగుదేశం మంత్రి రావెల కిశోర్ బాబు పరిస్థితి. సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చిన అమరావతి భూకుంభకోణంలో మంత్రి రావలె కిశోర్బాబుకు కూడా బోలెడంత పాత్ర ఉంది. ఆయన భార్య పేరుతో సాగిన భూ దందాల గురించి సాక్షిలో చాలా విపులమైన కథనాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో నా భార్య ఎప్పటినుంచో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది.. ఏం వ్యాపారం చేసుకోవడం తప్పా.. అంటూ రావెల చాలా గట్టిగానే ప్రశ్నించారు. కానీ ఇవాళ్టి రోజుల్లో భార్యలు రాజకీయ పదవులు చేపడితేనే భర్తలు అధికారం చెలాయిస్తున్నారు. అలాంటిది.. భార్య రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని అనడం అంటేనే… ఆమె పేరుతో సాక్షాత్తూ మంత్రిగారే నడిపిస్తున్న దందా అని ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఆ రకంగా మంత్రి రావెల కిశోర్ బాబుకు మొన్న భార్య (కళత్రం) రూపేణా పెద్ద దెబ్బే పడింది.
ఇప్పుడు పుత్రగండం కూడా ఆయన్ను పట్టిపీడిస్తున్నది. మంత్రి గారి కుమారుడు తాగిన మత్తులో ఉన్నట్లుగా చెప్పబడుతున్న సమయంలో.. కారులో ప్రయాణిస్తూ.. రోడ్డు పైన నడుస్తున్న ఒక అమ్మాయిని చెయ్యి పట్టుకుని లాగారని, కారులోకి లాక్కోడానికి ప్రయత్నించారని, ఆమెను వెంటబడి వేధించారని అభియోగం. ఈ కేసులో అమ్మాయి అసలు తనను టీజ్ చేసింది ఎవరో తెలియని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారు చూపించిన ఫోటోల ద్వారా గుర్తించడం కూడా జరిగిన తర్వాత.. హైదరాబాదు పోలీసులు రావెల కిశోర్ కుమారుడు సుశీల్ అరెస్టుకు వారంట్లు కూడా అందించారు. అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప.. తాగి అమ్మాయిలను వేధించిన కేసులో మంత్రి రావెల కుమారుడు కటకటాల్లోకి పోవాల్సి ఉంటుంది.
అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న తరుణంలో.. సరిగ్గా ఇలాంటి రెండు దెబ్బలు ఒకదాని వెంట ఒకటి పడడం అనేది మంత్రి రావెలకు గట్టి స్ట్రోక్ గానే చెప్పుకోవాలి! ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి రావెలను వైకాపా ఓ ఆటాడుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భూదందాలకు సంబంధించి అయితే.. తెదేపా పార్టీ యావత్తూ.. ఆ ఆరోపణల్లో మునిగి ఉన్నది గనుక.. అందరూ కలిసి ఎదురుదాడులకు తెగబడవచ్చు. కానీ.. కొడుకు వేసినట్లుగా ఆరోపణలు మోయవలసి వచ్చిన పోకిరీ వేషాల సంగతి మాత్రం రావెలను బాగానే చికాకుపెట్టే ప్రమాదం ఉంది. అసలే రకరకాల అవినీతి ఆరోపణలకు జవాబు చెప్పడం గురించి సతమతం అవుతున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇలాంటి ఆకతాయి పనులకు కూడా జవాబుదారి తనం వహించాలా అని చికాకు పడే అవకాశం కూడా ఉంది.