తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాగం అనేది దాదాపు వినిపించదు అనే అంటారు. ఒకవేళ ఏవైనా అసంతృప్తులుంటే లోలోపలే సర్దుబాటు చేసుకుంటారనీ అంటారు. కానీ, ఆయన మాత్రం అదే రాగం వినిపిస్తున్నారు..! ఆయనే మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు. నిజానికి, ఆయన వ్యవహార శైలిపై ఈ మధ్య పార్టీలో అంతర్గతంగా బాగానే చర్చ జరుగుతోందట. స్వయంకృతం వల్ల ఆయన మంత్రి పదవి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.టీడీపీలో దళితులకు గౌరవం దక్కడం లేదంటూ తాజాగా రావెల విమర్శలు చేస్తున్నారు. దళిత ప్రజా ప్రతినిధులకు సరైన గౌరవం లేదనీ, దాంతో తమ ఆత్మ గౌరవం దెబ్బతింటోందని రావెల సంచలన ఆరోపణలు చేశారు.
తెలుగుదేశం పార్టీ పాలనలో దళితుల ప్రజాప్రతినిధులకు పదవులు మాత్రమే ఉన్నాయనీ, అధికారాలన్నీ ఇతరుల చేతుల్లో ఉంటున్నాయని ఆరోపించారు. దళిత మంత్రులూ శాసన సభ్యులకు కనీస గౌరవం కూడా టీడీపీలో దక్కడం లేదన్నారు. ప్రత్తిపాడు నియోజక వర్గంతోపాటు రాష్ట్రంలో దాదాపు ఇతర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందనీ, అగ్రకుల నేతల పెత్తనం ఎక్కువైపోయిందన్నారు. కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీపై అక్కడి టీడీపీ ఇన్ ఛార్జ్ విష్ణువర్థన్ రెడ్డి పెత్తనం చేస్తున్నారనీ, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ పై సుబ్బరాజు చౌదరి, పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యేపై ఛైర్మన్ బాపిరాజు, మంత్రి నక్కా ఆనందబాబుపై మరో ఎమ్మెల్యే ఆలపాటి రాజా… ఇలా ఎక్కడ చూసినా ఎస్సీ నేతలపై అగ్రకులస్థులే అజమాయిషీ చేస్తున్నారన్నారు. పేరుకు మాత్రమే నాయకత్వం ఇచ్చి, అధికారమంతా వారి అదుపాజ్ఞల్లో పెట్టుకుంటే దళితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలతో విజ్ఞానవంతులూ విద్యావంతులూ రాజకీయాల్లోకి వస్తున్నారనీ, కానీ ఇలాంటి ఆధిపత్య పోకడలను వారు సహించే పరిస్థితి ఉండదన్నారు.
మంత్రి పదవి పోయిన దగ్గర నుంచీ రావెల నిరసన గళం పెంచుతున్నారనీ, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందో లేదో అనే అభద్రత ఆయనలో పెరుగుతోందనీ, అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమౌతోంది. అంతేకాదు, రావెల ఇతర పార్టీలవైపు చూస్తున్నారనే గుసగుసలు కూడా ఉన్నాయి. సరే, కారణం ఏదైనా కావొచ్చు.. కానీ, తనతోపాటు కొందరు నేతల పేర్లను ఊటంకించి మరీ అగ్రకులాల అణచివేతకు గురౌతున్నామని ఆయన ఆరోపించడం మాత్రం తీవ్రమైన అంశమే..!