ఏపి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ బంజారా హిల్స్ ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న ఒక ముస్లిం వివాహిత మహిళతో నిన్న అసభ్యంగా ప్రవర్తించినందుకు బంజారా హిల్స్ పోలీసులు అతనిపై నిర్భయ చట్టంలోని సెక్షన్ 345డి క్రింద కేసు నమోదు చేసారు. ఈ వ్యవహారంపై మంత్రి రావెల స్పందిస్తూ తనకు చట్టం మీద గౌరవం ఉందని, తన కొడుకు కేసు విషయంలో తను కలుగజేసుకోనని చెప్పారు. ఈ కేసు తెలంగాణా రాష్ట్ర పరిధిలో ఉందని, ఆంద్రాలో అయినా తెలంగాణాలో అయినా ఇటువంటి కేసులలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రావెల చెప్పారు.
తన కొడుకు పట్టపగలు నడిరోడ్డుపై ఒక వివాహిత ముస్లిం మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం మంత్రిగా ఉన్న రావెల కిషోర్ బాబుకి, ఆయన కుటుంబానికి చాలా అప్రదిష్ట కలిగించేదే. పైగా తన కొడుకుపై తెలంగాణాలో కేసు నమోదు అయింది కనుక ఇంకా ఇబ్బందికరంగా మారవచ్చును. ఆయన కుమారుడు సుశీల్, డ్రైవర్ ఇద్దరూ కూడా ఈపాటికే ఆంధ్రాలో సురక్షితమయిన ప్రదేశానికి వెళ్ళిపోయి ఉండవచ్చును. కనుక తనకు చట్టంపై చాలా గౌరవం ఉందని చెపుతున్న మంత్రి రావెల స్వయంగా పరారిలో ఉన్న తన కొడుకుని పోలీసులకు అప్పగించి తన నిజాయితీని నిరూపించుకొంటే అందరూ హర్షిస్తారు.
మంత్రి కొడుకు కనుక అతనిని ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నాలు తప్పకుండా జరుగవచ్చును. కానీ అటువంటిదేమీ లేదని ఎసిపి ఉదయ కుమార్ చెప్పారు. తాము కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టామని చెప్పారు. అతనితో బాటు డ్రైవర్ కి కూడా రెండు రోజులలోగా పోలీసుల ముందు లొంగిపొమ్మని ఆదేశిస్తూ నోటీసులు పంపారు. కానీ వారిద్దరూ పరారిలో ఉన్నట్లు ఎసిపి ఉదయ్ కుమార్ మీడియాకి తెలిపారు. ఒకవేళ రెండు రోజుల్లోగా వారిద్దరూ తమకు లొంగిపోకపోతే వారి పేరిట అరెస్ట్ వారెంట్లు జారీ అరెస్ట్ చేస్తామని బంజారా హిల్స్ డిసిపి వెంకటేశ్వరులు మీడియాకి తెలియజేసారు. కానీ ఇటువంటి కేసులలో వేరేవరినో బలిపశువును చేసి అసలు నేరస్తులు తప్పించుకోవడం చాలా సార్లు జరిగిందే. కనుక మంత్రి గారి కొడుకుకి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఆశించలేము.
స్థానిక కార్పొరేటర్ గా ఉన్న తెరాస నేత కె. కేశవ్ రావు కుమార్తె విజయలక్ష్మి మంత్రిగారి కొడుకుని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. పట్టపగలే మహిళలు రోడ్లపై తిరుగలేని పరిస్థితి ఉంటే ఇంకా దేశంలో మహిళలు ఇళ్ళ నుండి బయటకు రాకుండా జీవించవలసి ఉంటుందని ఆమె అన్నారు.