ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్, అతని డ్రైవర్ రమేష్ కి చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి తిరుపతయ్య రెండు వారాల రిమాండ్ విధించడంతో ఆదివారం సాయంత్రం పోలీసులు వారిద్దరినీ చంచల్ గూడా జైలుకి తరలించారు. వారికి బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ముస్లిం మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు వారిరువురుపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
ఈ కేసులో తను జోక్యం చేసుకోనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేస్తే ఎవరికయినా శిక్షపడదని మంత్రిగారు మొదట చెప్పారు. కానీ తన కొడుకు ఆ ముస్లిం మహిళను వేధిస్తున్నట్లు సిసిటివి ఫుటేజి ఆధారాలు కూడా లభించడంతో మాట మార్చి, తనను రాజకీయంగా దెబ్బ తీయడానికే జగన్మోహన్ రెడ్డి తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి అమాయకుడయిన తన కొడుకు మీద పోలీస్ కేసు పెట్టించారని, తన చేతిలో ఉన్న సాక్షి మీడియా ద్వారా వీడియోని మార్ఫింగ్ చేసి జరగనిది జరిగినట్లు చూపిస్తూ దళిత విద్యార్ధి అయిన తన కుమారుడి జీవితంతో ఆడుకొంటున్నాడని ఆరోపించారు.
ఆయన తనకు చట్టాలు, న్యాయస్థానంపై గౌరవం ఉందని చెపుతున్నారు. తన కొడుకు నిర్దోషి అని వాదిస్తున్నారు. గనుక ఆ మాటకు కట్టుబడి చట్టాన్ని తన పని తాను చేసుకుపోనిస్తే కొడుకు నిర్దోషిత్వం రుజువు చేసుకొని బయటపడవచ్చును కదా? కానీ ఈవిధంగా మాట్లాడుతూ ఈ కేసుపై రాజకీయాలు చేయడం మరో పెద్ద తప్పు.
తన కొడుకుకి ఇటువంటి దుస్థితి కలగినందుకు తండ్రిగా రావెల కిషోర్ బాబు ఆవేదన చెందడం సహజమే కానీ తన కొడుకు పట్ట పగలు తప్ప త్రాగి రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన అధికార వాహనంలో రోడ్ల మీద తిరుగుతుండటం, నడిరోడ్డు మీద ఒక వివాహిత ముస్లిం మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని తప్పుగా భావిస్తున్నట్లు లేదని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈవిధంగా కొడుకుని వెనకేసుకువచ్చి ఆయన కూడా అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారని చెప్పవచ్చును. పైగా ఈ వ్యవహారంలో ఆయన జగన్ పై నింద వేయడం, ఈ సమస్యను ఇరు రాష్ట్రాల సమస్యగా మార్చే ప్రయత్నం చేయడం, కుల ప్రస్తావన చేయడం అన్నీ కూడా పొరపాట్లేనని చెప్పక తప్పదు. ఆయన కొడుకు ఒక వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవరిస్తే, కొడుకుని వెనకేసుకువచ్చి ఆయన యావత్ మహిళల పట్ల చులకన భావం ప్రదర్శించారు. అందుకే ఆయనను మంత్రిపదవి నుండి తక్షణమే తొలగించాలని వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేసారు.
ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి వ్యక్తిగత సమస్యలను కూడా రాష్ట్ర సమస్యలుగా చిత్రీకరిస్తే కొత్త సమస్యలను ఆహ్వానించినట్లవుతుంది. అదీ కాక రాజధాని భూఅక్రమాల గురించి వైకాపా చేస్తున్న ఆరోపణలతో ఇప్పటికే ఏపి ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. ఇప్పుడు మంత్రిగారి పుత్రరత్నం చేసిన పనిని వెనకేసుకువచ్చినట్లయితే అది ప్రజలకు తప్పుడు సంకేతం పంపించినట్లవుతుంది.