మూసకు భిన్నమైన సినిమాలు తీయాలనుకుంటాడు రవిబాబు. కానీ తానే ఓ మూసలో పడిపోయాడు. థ్రిల్లర్ కథల్ని వదిలి బయటకు రాలేకపోతున్నాడు. ‘అనసూయ’ హిట్టయ్యిందని ‘అమరావతి’ తీశాడు. అది డిజాస్టర్ అయ్యింది. ‘అవును’ హిట్టవ్వడంతో ‘అవును 2’ తీశాడు అది ఫ్లాప్ అయ్యింది. లడ్డూబాబు, అదుగో.. సినిమాలు కూడా డిజాస్టర్ లిస్టులో చేరాయి. ‘అదుగో’ తరవాత కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ‘ఆవిరి’ అనే సినిమా రూపొందించాడు. ‘అ’ సెంటిమెంట్‌తో పాటు తన అలవాట్లనీ రవిబాబు వదులుకోలేదు. పోస్టర్ని వినూత్నంగా తయారు చేసి మార్కులు కొట్టాడు. కాకపోతే.. ఈసారైనా ఈ కుక్కర్ విజిల్ వేస్తుందా? రవిబాబుకి హిట్టునిస్తుందా? అనేదే డౌటు. థ్రిల్లర్లు, హారర్లూ ఈమధ్య రొటీన్ ఫార్ములాగా మారిపోయాయి. వాటిలో సత్తా ఉన్న సినిమాలే ఆడుతున్నాయి. ఏమాత్రం గురి తప్పినా ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర కనిపించడం లేదు. మరి రవిబాబు ఈ సవాల్‌ని ఎలా స్వీకరిస్తాడో చూడాలి. అన్నట్టు మొన్నటి వరకూ సురేష్‌బాబు బ్యానర్ పేరుని వాడుకున్న రవిబాబు.. ఇప్పుడు దిల్‌రాజు దగ్గరకు చేరాడు. ఈ సినిమాకి దిల్‌రాజునే సమర్పకుడు. దిల్ రాజు అదృష్టమన్నా రవిబాబుకి కలిసొస్తుందేమో చూడాలి.