ఏ ముహూర్తాన దర్శకుడు రవిబాబు పందిపిల్ల మెయిన్ లీడ్‌గా ‘అదుగో’ సినిమా స్టార్ట్ చేశారో గానీ… విడుదలకు దర్శక నిర్మాతలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గతేడాది అక్టోబరులో సినిమా టీజర్ విడుదల చేశారు. ఇప్పటివరకూ విడుదల తేదీ గురించి ఒక్క ముక్క చెప్పలేదు. మధ్య మధ్యలో పందిపిల్లతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ మీడియా ముందుకి వస్తున్నారు రవిబాబు. నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో జనం ఎటిఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇక్కట్లు పడుతున్న సమయంలో పందిపిల్లతో ఎటిఎం దగ్గర క్యూలో నిలబడి ప్రజల దృష్టిని ఆకర్షించాడీ దర్శకుడు. తరవాత పందిపిల్లతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొదట్లో సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగింది. ఒక్కో నెల ఒక్కో ఏడాది ఆలస్యం చేస్తున్న కొలదీ అందరిలో ఆసక్తి తగ్గుతోంది. దీనికి తోడు ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఫిట్నెస్ ఛాలెంజ్‌ని అందరూ మర్చిపోయిన సమయంలో దాంతో పబ్లిసిటీ స్టంట్ చేశారు. సుమారు రెండేళ్లుగా ఇదే తంతు. క్రేజ్ వున్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే సూత్రం రవిబాబుకి తెలియనిది కాదు. మరెందుకు సినిమాను విడుదల చేయనుకుండా ఆలస్యం చేస్తున్నారో? ‘అదుగో’.. ఇదుగో… అనడమే తప్ప సినిమాను చూపించరా? అని ప్రజలు అనుకోవలసి వస్తుంది.
విడుదల ఆలస్యం కావడం వల్ల రవిబాబుకూ ఓ భారం తప్పడం లేదు. ప్రతిసారీ కొత్త పందిపిల్లను వెతుక్కోవాల్సి వస్తుందని సమాచారం. ఎందుకంటారా? రెండేళ్లుగా పందిపిల్ల ఒక్కటే సైజులో వుంటుందా? పెరుగుతుంటుంది కదా! ప్రతిసారి మీడియా ముందుకు తెచ్చేది ఒకే పందిపిల్ల కాదు. ఎప్పటికప్పుడు స్మాల్ సైజు పందిపిల్లను సెలెక్ట్ చేస్తున్నార్ట!!