రాజమౌళి ప్రభావం ఇండ్రస్ట్రీపై చాలా ఉంది. రాజమౌళి స్టైల్లో సినిమాలు తీద్దామని ప్రయత్నించి దర్శకులు మన కళ్లముందే ఉన్నారు. సై తరవాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో సినిమాల ప్రవాహం మొదలైంది. మగధీర తరవాత చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు క్యూ కట్టాయి. ఆయన బాహుబలి తీస్తే… గుణశేఖర్ రుద్రమదేవి అంటూ హడావుడి చేశాడు. ఈగకూ పోటీ వచ్చాయి కొన్ని సినిమాలు. రేలంగి నరసింహారావు ఎలుకతో సినిమా తీశారు. ఇప్పుడు రవిబాబు.. పందిపిల్లని హీరో చేసేశాడు.
రవిబాబుకు గత కొంత కాలంగా ఏం కలసి రావడం లేదు. లడ్డూబాబు ఫట్ మంది. అవును 2 తో దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. మనసారా మటాష్ అయిపోయింది. ఏ సినిమా పట్టుకొన్నా.. అంతే సంగతులు అనిపిస్తోంది. ఇలాంటి దశలో పంది పిల్లతో సినిమా అంటూ… మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. రవిబాబు కాస్త భిన్నంగా ఆలోచిస్తాడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ కోవలో చూస్తే… ఇది మరో ప్రయోగాత్మక చిత్రం అనుకోవాలి. అయితే… రవిబాబు మాత్రం గ్రాఫిక్స్, హంగామా అంటూ హడావుడి చేస్తున్నాడు. పంది పిల్లను ఏకంగా సెంట్రల్ క్యారెక్టర్ చేసేశాడు. ఆ పందిపిల్ల ఎంత బుజ్జిగా ఉన్నా.. వరాహతారం అంటే చాలామందికి గిట్టదు. అసహ్యించుకొంటారు. అలాంటి పందిపిల్లపై ఫోకస్ చేస్తూ సినిమా తీయాలనుకోవడం నిజ్జంగా సాహసమే. ఏదో కొత్తగా ట్రై చేద్దామనుకొంటే తప్పకుండా హర్షించాల్సిందే. రాజమౌళి ఈగే అన్ని అద్భుతాలు చేసింది.. పంది పిల్ల ఇంకా పెద్దది అనుకొంటూ గారడీలు చేద్దామనుకొంటే మాత్రం లడ్డూబాబు, అవును 2, మనసారా ఫలితమే రిపీట్ అయ్యే ఛాన్సుంది. జాగ్రత్త మరి..