అల్లరిలాంటి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలెట్టాడు రవిబాబు. ఆ తరవాత ఆ జోనర్లోనే ఎక్కువ సినిమాలు చేశాడు. అవును నుంచి హరర్ వైపు దృష్టి మరల్చాడు. ఆ సినిమా హిట్టవ్వడంతో.. అవును 2 అంటూ సీక్వెల్ తీశాడు. అది కాస్త ఫట్టుమంది. ఇప్పుడు ఆవిరి అంటూ మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కూడా హారర్ సినిమానే. అవును, అవును 2లలో రవిబాబు ఎంచుకున్న `ఇన్ విజబుల్ గోస్ట్`ని మళ్లీ ఈసినిమాలోనూ వాడుకున్నాడు రవిబాబు. టీజర్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఓ ఇంట్లో పాపకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించని దెయ్యం… దాని చుట్టూ అల్లుకున్న కథ.. ఈ `ఆవిరి`. రవిబాబు ఫ్రేమింగులు, కలరింగులు, టేకింగులు అన్నీ కొత్తగా ఉంటాయి. తన సినిమా టోన్ వేరేలా ఉంటుంది. అది.. `ఆవిరి` మరోసారి నిరూపించబోతోంది. ఓ ఇంట్లో తీసిన సినిమా ఇది. కాకపోతే… కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం వల్ల కొత్త కలరింగు వచ్చింది. భార్యాభర్త, మున్నీ అనే అమ్మాయి.. వీళ్ల చుట్టూ నడిచే కథ ఇది. మున్నీ ప్రవర్తన వింత వింతగా ఉంటుంది. గాల్లో ఎవరితోనో మాట్లాడుతుంటుంది. అది దెయ్యం అని మనం అర్థం చేసుకోవాలి. అస్తమానూ ఇంట్లోంచి పారిపోవాలన్న ఆలోచనలో ఉండే మున్నీని ఆ ఇల్లు దాటకుండా అమ్మానాన్నలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. అయినా సరే.. ఓ రోజు మున్నీ ఇంట్లోంచి పారిపోతుంది. ఆ తరవాత ఏం జరిగిందన్నది ఆసక్తికరం. గొప్ప కథ కాకపోయినా, ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెట్టగలిగే పాయింట్ ఈ కథలో ఉంది. ట్రైలర్లో హారర్ మూమెంట్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఫ్రిజ్జులో పాపని కూర్చోబెట్టడం, ఎవరూ లేకుండానే దుప్పటి తొలగిపోవడం లాంటి రొటీన్ షాట్లూ కనిపిస్తాయి. వచ్చేనెల 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.