కాస్టింగ్ కౌచ్…. ఇండ్రస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశమైన పాయింట్. కాస్టింగ్ కౌచ్ బాధితులమంటూ చాలామంది కథానాయికలు మీడియాకెక్కారు. ఆ హీరో అలా, ఈ హీరో ఇలా… అంటూ వాళ్ల పేర్లు చెప్పకుండానే బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్ వందకు వంద శాతం ఉన్నాయన్నది రోజురోజుకీ బలపడుతున్న నిజం. అయితే… ఇప్పుడు మరో నిజం తెలిసొచ్చింది. అదేంటంటే.. మగవాళ్లకూ ఇలాంటి లైంగిక వేధింపులు తప్పడం లేదట. హీరోయిన్లని హీరోలు వేధిస్తున్నట్టు కొంతమంది హీరోయిన్లు… అప్పుడప్పుడే పరిశ్రమలో అడుగుపెడుతున్న హీరోల్ని, క్యారెక్టర్ ఆర్టిస్టుల్నీ, విలన్లనీ వేధిస్తున్నారట. ఈ విషయాన్ని విలన్ పాత్రలో మెప్పించిన రవి కిషన్ అంటున్నాడు. భోజ్పురి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి.. తెలుగులో ‘రేసు గుర్రం’, ‘రాధ’, ‘లై’, ‘కిక్-2’ తదితర చిత్రాల్లో ప్రతినాయకుడిగా భయపెట్టాడు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. కొంతమంది నటీమణులు కూడా మగవారిని వేధిస్తున్నారని, అయితే అవకాశాల కోసం వాళ్లు చెప్పినవన్నీ చేయడం తప్పని, ఒకవేళ జీవితంలో ఎదిగినా, ఆ మచ్చ అలానే ఉండిపోతుందని వ్యాఖ్యానించాడు. తన విషయంలో కూడా కొంతమంది కథానాయికలు పలు రకాలుగా వేధించారని చెప్పుకొచ్చాడు. రవికిషన్ కామెంట్లతో చిత్రసీమలో మరో చీకటి కోణం బయటపడినట్టైంది. ఇంతకాలం హీరోయిన్లు మైకులు పట్టుకుని అరచారు. ఇప్పుడు హీరోలు, కండలు తిరిగిన విలన్లు గళం విప్పుతారేమో చూడాలి.