వందో సినిమాతో సంచలనం సృష్టించాడు నందమూరి బాలకృష్ణ. తన 99 సినిమాల రికార్డుల్ని గౌతమిపుత్ర శాతకర్ణి బద్దలు కొట్టేసింది. ఇప్పుడు అభిమానుల దృష్టి బాలయ్య 101వ సినిమాపై కేంద్రీకృతమైంది. బాలయ్య కోసం చాలామంది దర్శకులు ఇప్పటికే కథలు రెడీ చేసేసుకొన్నారు. అయితే బాలయ్య మాత్రం కాస్త కూడా తొందర పడడం లేదు. వందో సినిమా కోసం ఎంత వేచి చూశాడో.. 101వ సినిమాకోసం కూడా అంతే ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు. ఈలోగా బాలయ్యకు కథ వినిపించాలన్న దర్శకుల క్యూ పెరుగుతూనే ఉంది. ఆ జాబితాలో ఓ తమిళ దర్శకుడు కూడా చేరిపోయినట్టు సమాచారం. తనే కె,ఎస్.రవికుమార్.
తమిళనాట రజనీకాంత్, కమలహాసన్, సూర్య, విజయ్‌లాంటి స్టార్లతో సినిమాలు చేశాడు రవికుమార్. తెలుగులో చిరంజీవి, నాగార్జులతో పనిచేశాడు. కమర్షియల్ దర్శకుడిగా, తక్కువ టైమ్‌లో సినిమాలు తీసిపెట్టే ప్రతిభావంతుడిగా రవికుమార్కి మంచి పేరే ఉంది. తెలుగులో ఓ సినిమా చేయాలని గత కొంతకాలం నుంచీ రవికుమార్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాజాగా బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసినట్టు, బాలయ్య అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. తమిళ దర్శకులతో పనిచేయడానికి మిగిలిన హీరోలంతా రెడీగా ఉన్నా… బాలయ్య ఎందుకనో సముఖత చూపించడం లేదు. ఇటీవల కె.వాసు ఓ కథ చెప్పడానికి ప్రయత్నిస్తే బాలయ్య కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. మరి రవికుమార్ కి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాలి.