టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను ఎలాగైనా.. అరెస్ట్ చేసి.. జైలుకు పంపాలన్న తమ లక్ష్యాన్ని .. ఆయనను టార్గెట్ చేసిన వారు నెరవేర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రైవేటు కంపెనీలో అవకతవకలు జరిగాయంటే… వాటిని గుర్తించడానికి ఓ ప్రాసెస్ ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా.. అలంద మీడియా నుంచి.. ఈ రోజు రాత్రి.. ఓ ఫిర్యాదు రావడంతో.. తర్వాతి రోజే… అదుపులోకి తీసుకోవడం.. కోర్టు సమయం ముగిసిన తర్వాత.. అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించడం.. మొత్తం ఓ ప్రణాళిక ప్రకారం.. రవిప్రకాష్‌ను… ఎలాగైనా.. కొద్ది రోజులు జైల్లో ఉంచాలన్న లక్ష్యం నెరవేర్చుకోవడానికి చేసినట్లుగా ఉందంటున్నారు.
రవిప్రకాష్, సీఎఫ్‌వో, ఫెరీరా.. రూ. 20 కోట్ల నిధులను.. ఏడాది కిందట మళ్లించుకుంటే… ఇప్పటి వరకూ ఎందుకు కనిపెట్టలేకపోయారనే మౌలిక ప్రశ్న మొదటగా వస్తుంది. ఎందుకంటే.. యాజమాన్యం మారేటప్పుడు… రవిప్రకాష్‌ను పదవి నుంచి తీసేయాలనుకున్నప్పుడు… మొత్తం ఆర్థిక వ్యవహారాలను జల్లెడ పట్టారు. అప్పుడు ఒప్పు అయిన లావాదేవీలు ఇప్పుడు.. తప్పు ఎలా అయ్యాయో అన్న చర్చ నడుస్తోంది. ఒక వేళ..అందులో ఏదైనా అక్రమ లావాదేవీలు ఉంటే… తేల్చుకోవాల్సిన ప్రక్రియ వేరే ఉంటుంది. కానీ.,.. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినట్లుగా పోలీసులు చాన్స్ తీసుకున్నారు.
ఓ ప్రణాళిక ప్రకారమే..శుక్రవారం.. అలంద మీడియా ప్రతినిధి ఫిర్యాదు చేశారరంటున్నారు. శనివారం మధ్యాహ్నం… పోలీసులు రవిప్రకాష్ ను విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు కూర్చోబెట్టి… సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే.. అప్పటికే కోర్టు సమయం ముగిసింది. ఆదివారం కోర్టుకు సెలవు .. ఆ తర్వాత దసరా సెలవులు. దాంతో.. తమ అభీష్టం మేరకు.. రవిప్రకాష్‌ను కొన్నాళ్ల పాటు జైల్లో ఉంచవచ్చన్న లక్ష్యంతోనే.. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ముందడుగు వేసినట్లుగా చెబుతున్నారు. ఇతర కేసుల విషయంలో బెయిల్ ఉండటంతో… కొత్తగా కేసు నమోదు చేశారని అంటున్నారు. మొత్తానికి అలంద మీడియా యాజమాన్యం.. తమకు ఉన్న అపరిమితమైన అధికారాలతో చేయాలనుకున్నది చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.