టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ .. రాజ్ న్యూస్ బాధ్యతలు తీసుకున్నారు. తెర ముందుకు రావడం లేదు కానీ… ఇప్పుడు ఆ చానల్లో మారిపోయిన వార్తా సరళిని చూస్తే.. రవిప్రకాష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీకి మద్దతుగా ఏకపక్షంగా వెళ్లిపోతోంది. అలా అని గుడ్డిగా చూసేవాళ్లు కూడా నవ్వకునేంత అతిశయోక్తులు చూపించడం లేదు. నిజమే కదా అనిపించలేలా బీజేపీకి మద్దతు కూడగడుతున్నారు. ఆ చానల్‌కు ఫండింగ్ ఏ బీజేపీ నేతో తెలియదు కానీ.. రవిప్రకాష్ వ్యూహాల్ని.. ఎన్నికలకు కూడా వాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నికల విషయంలో రవిప్రకాష్ ఇచ్చిన సలహాలు వర్కవుట్ కావడంతో.. గ్రేటర్ ఎన్నికల్లో మరింతగా ఆయనను ఇన్వాల్వ్ చేస్తున్నారని చెబుతున్నారు.
గ్రేటర్లో ఎలాంటి ప్లాన్లు అమలు చేయాలన్నదానిపై బీజేపీ ముఖ్యనేతలు నిర్వహించే సమావేశాలకు రవిప్రకాష్‌కు కూడా ఆహ్వానం అందుతోందని.. ఆయన కూడా.. తన వంతు సాయం చేస్తున్నారని చెబుతున్నారు. రవిప్రకాష్.. ప్రజల నాడి తెలిసిన వ్యక్తి. విమర్శలు.. ఎన్ని వచ్చినా.. ప్రజలు మెచ్చే వార్తాంశాలనే ఆయన టీవీ9కు ఎంచుకునేవారు. ఈ క్రమంలో మీడియా విలువలని.. ఇంకోటని..ఆయనపై విరుచుకుపడేవారు. కానీ అంతిమంగా సక్సెక్సే మాట్లాడుతుంది. సక్సెస్ కోసం అందరూ అదే దారిలో నడవాల్సిందే. ఎన్ని విమర్శలు చేసినా టీవీ9 దారిలో నడిచి టీఆర్పీలు పెంచుకునేందుకు అన్ని చానళ్లు ప్రయత్నించాయి.
కానీ అనుకరణ ఎప్పుడూ అనుకరణే. సక్సెస్ అయిన వారు కొందరే. ఇప్పుడు తన మీడియా సక్సెస్ ఆలోచనలు.. గ్రేటర్లో బీజేపీ సక్సెస్ కోసం… రవిప్రకాష్ వినియోగిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రతీ రోజూ బీజేపీ వార్తల్లో ఉండటానికి ఇదే కారణం అన్న అంచనాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి బీజేపీ భావజాలానికి రవిప్రకాష్ భావజాలానికి అసలు సరిపడదు. కానీ… రాజకీయంలో బాధితుడిగా మిగిలిన రవిప్రకాష్.. తనను తాను కాపాడుకోవడానికి … మళ్లీ పూర్వ వైభవం పొందడానికి తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు.