టీవీ9 సీఈఓ స్థానం నుంచి రవి ప్రకాష్ అనేక వివాదాల నడుమ నిష్క్రమించడంతో, టీవీ9 వైఖరిలో కూడా కొద్దిగా మార్పు కనిపిస్తోంది. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ వార్తలను ప్రసారం చేయకుండా ఉన్న టీవీ9 లో, ఈరోజు చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
గత సంవత్సరం ఏప్రిల్లో తన తల్లిని దూషింపచేశారు అంటూ పవన్ కళ్యాణ్ మీడియా మీద తిరగబడడం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని అంతటినీ డిజైన్ చేసింది రవి ప్రకాషే అంటూ నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆ తర్వాత టీవీ9 పవన్ కళ్యాణ్ వార్తలను ఇవ్వడం మానేసింది. లక్షలాది మంది పవన్ కళ్యాణ్ సభకు హాజరైనా, దాని గురించి కనీసం చిన్న స్క్రోలింగ్ కూడా ఇచ్చేది కాదు టీవీ9. అలాగే పవన్ కళ్యాణ్ కూడా టీవీ9 లోగో తో వచ్చిన మైక్ ఉంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేశాడు.
అయితే ఇప్పుడు రవి ప్రకాష్ టీవీ9 నుంచి నిష్క్రమించిన తర్వాత ఒక్కరోజులోనే పరిస్థితులు మారిపోయాయి. నంద్యాల లో ఎస్.పి.వై.రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ తో టీవీ9 ప్రతినిధి ఇంటర్వూ తీసుకున్నారు. ఫలితాల మీద తన విశ్లేషణ అడిగి తెలుసుకున్నారు. ఓటర్ సరళి మారింది అని, మే 23 వరకు ఎవరు ఏమి మాట్లాడినా అది కేవలం ఊహాగానాలు మాత్రమేనని పవన్ వ్యాఖ్యానించారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తో టీవీ9 యాజమాన్యానికి ఏ మాత్రం ఇబ్బంది లేదని కేవలం రవిప్రకాష్ కు మాత్రమే పవన్ కళ్యాణ్ తో సమస్య అన్న సంకేతాలను ఇటు టీవీ9 పంపిస్తే, పవన్ కళ్యాణ్ కూడా అదే తరహా సంకేతాలు పంపినట్లు అయింది.