టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ రూ. 10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం ట్రైబ్యునల్ టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తేల్చి చెప్పింది. వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్ చేసిన చర్యలు అనైతికమని పేర్కొంది. వాటాల విక్రయ ఒప్పందం గురించి ఆయనకు కూడా తెలిసే జరిగిందని, అందులో ఆయన కూడా భాగమేనని పేర్కొంటూ.. ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.
టీవీ 9 అమ్మకం.. యాజమాన్యం మార్పు అనంతర పరిస్థితులు మీడియారంగంలో సంచలనం సృష్టించాయి. మెజార్టీ వాటాను కొన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు.. మైనర్ వాటా ఉన్న ఇతరుల మధ్య.. వివాదం.. కేసుల వరకూ వెళ్లింది. టీవీ 9చానళ్ల యాజమాన్యంగా ఉన్న శ్రీనిరాజు తనకు ఉన్న ఎనభై శాతం వాటాలను మేఘా కృష్ణారెడ్డి, మైహోం జూపల్లి రామేశ్వరరావులకు అమ్మేశారు. అప్పట్నుంచే వివాదం ప్రారంభమయింది. దాదాపుగా రూ. 5వందల కోట్లు వెచ్చించిన ఈ డీల్ తర్వాత… బడా కాంట్రాక్టర్లు.. అలంద మీడియా అనే కంపెనీ తరుపున నలుగురు డైరక్టర్లను నియమించారు.
కానీ.. ఆ నియామకం చట్ట విరుద్ధమని.. అసలు మిగిలిన ఇరవై శాతం వాటాదారులకు తెలియకుండానే.. అమ్మకం జరిగిందని ఆరోపిస్తూ… 20 శాతం ఉన్న వాటాదారులు.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వెళ్లారు. వీరిలో రవిప్రకాష్ ఒకరు. టీవీ 9 అమ్మకం హవాలా సొమ్ము ద్వారా జరిగిందని డబ్బులు ఎలా… చేతులు మారాయో కూడా.. ఆయన వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారమే.. లావాదేవీలు జరిపామని టీవీ 9 కొత్త యాజమాన్యం ప్రకటించింది. ఆ మేరకు వాదనలు వినిపించి ఫలితం పొందింది.