అక్రమంగా బోనస్ తీసుకున్నారంటూ… టీవీ9 కొత్త యాజమాన్యం పెట్టిన కేసులో..రిమాండ్ లో ఉన్న మాజీ సీఈవో రవిప్రకాష్… తాను త్వరలో మళ్లీ టీవీ9కి చైర్మన్ గా, సీఈవోగా తిరిగి వస్తానని ఓ సందేశం బయటకు పంపారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన తన మేనేజర్ ద్వారా… మీడియా మిత్రులకు ఈ బహిరంగ సందేశం పంపారు. ఇందులో చాలా స్పష్టంగా… టీవీ9 చైర్మన్, సీఈవోగా త్వరలో రాబోతున్నానని ప్రకటించారు. ఈ ప్రకటన సహజంగానే ఆసక్తి రెకేత్తిస్తోంది. రవిప్రకాష్ మైండ్ గేమ్‌లో భాగంగా ఈ ప్రకటన చేశారా..లేక నిజంగానే మళ్లీ టీవీ9ని సొంతం చేసుకునే దిశగా ప్లాన్ ఏమైనా అమలు చేశారా… అన్నదానిపై మీడియావర్గాల్లోచర్చ జరుగుతోంది. రవిప్రకాష్ ఈ ప్రకటన చేసే సమయానికి టీవీ9 కొత్త యాజమాన్యంలో ఒకరైన మేఘా కృష్ణారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. సుదీర్ఘంగా సాగుతున్న ఐటీ దాడుల్లో.. అసలేం జరుగుతుందో బయటకు తెలియడం లేదు.
నిజానికి టీవీ9 కొనుగోలు వ్యవహారం అక్రమం అని…రవిప్రకాష్ వాదిస్తున్నారు. బోర్డులో కొత్త డైరక్టర్లు కూడా నిబంధనల విరుద్ధంగా వచ్చారని ఎన్సీఎల్టీలో కేసు వేశారు. ఈ కేసు ప్రస్తుతం ఎన్సీఎల్టీలో ఉంది. అయితే.. టీవీ9 కొత్త యాజమాన్యం తమకు ఉన్న పవర్ తో.. రవిప్రకాష్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయించడంతో.. విషయం పోలీసుల వద్ద కూడా ఉంది. ఈ క్రమంలో రవిప్రకాష్ పై … సీబీఐ, ఐటీ, ఈడీ విచారణ చేయాలంటూ… ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేదని విజయసాయిరెడ్డి చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం కలకలం రేపింది. ఇవే ఆరోపణలతో.. అంతకు ముందే టీవీ9 కొత్త యాజమాన్యం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిందని.. అందులో వాస్తవాల్లేవని తేల్చారని కూడా… రవిప్రకాష్ క్యాంప్ ప్రచారం చేస్తోంది.
ఈ క్రమంలో.. హఠాత్తుగా రవిప్రకాష్… తాను మళ్లీ టీవీ9 చైర్మన్ కమ్ సీఈవోగా తిరిగి వస్తానని.. మీడియాలో ఉన్న మిత్రులకు సందేశం పేరుతో… ఓ ప్రకటన చేసి.. కలకలమే రేపారు. జరుగుతున్న పరిణామాలు… మారుతున్న వ్యవహారాలు చూసిన వారికి… ఏదో జరగోబోతోందని మాత్రం అనిపిస్తోంది. అది రవిప్రకాష్ చెబుతున్నట్లుగా.. టీవీ9 చైర్మన్, సీఈవోగా రావడమే.. మరొకటా.. అన్నది కాలమే తేల్చాలి..!